దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court:దేశద్రోహ చట్టం ప్రామాణికతను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్న CJI.. ప్రస్తుతం అది ప్రజల స్వేచ్ఛను అణిచివేసేందుకు ఉపయోగపడేలా ఉందని అభిప్రాయపడ్డారు

Update: 2021-07-15 08:01 GMT

Supreme Court: ఐపీసీ సెక్షన్‌ 124A దుర్వినియోగంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహ చట్టం ప్రామాణికతను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్న CJI.. ప్రస్తుతం అది ప్రజల స్వేచ్ఛను అణిచివేసేందుకు ఉపయోగపడేలా ఉందని అభిప్రాయపడ్డారు. ఐతే.. IPC సెక్షన్‌ 124A రద్దు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ అన్నారు.

కొన్ని మార్గదర్శకాలు నిర్దేశిస్తే చట్టపరమైన ప్రయోజనం ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఐతే.. ఈ 124 A దేశద్రోహ చట్టం వలసవాద చట్టమని, స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అది అవసరమా అని కోర్టు ప్రశ్నించింది. దేశద్రోహ చట్టం ఒక వలసవాద చట్టమని అది బ్రిటిష్ వాళ్లు భారతీయుల స్వేచ్ఛను అణచివేయడానికి ఉపయోగించారని గుర్తి చేసింది. దీన్ని మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్‌ లాంటి వారికి వ్యతిరేకంగా ఉపయోగించారని పేర్కొంది.

అధికార దుర్వినియోగానికి వీలున్న ఇలాంటి వాటిపై కచ్చితంగా సమీక్ష అవసరమని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని సూచించింది. చట్టం దుర్వినియోగం అవుతుండడం, జవాబుదారీతనం లేకపోవడం పలు సందర్భాల్లో బయటపడినందునే ఈ రాజద్రోహం అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నట్టు చీఫ్ జస్టిస్ తెలిపారు.

IPCలోని సెక్షన్‌ 124Aను సవాల్ చేస్తూ రిటైర్డ్ మేజర్ జనరల్‌ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. అసలు ఈ సెక్షన్ కింద పెడుతున్న కేసులెన్ని, అందులో నిలబడుతున్నవెన్ని అన్ని కోర్టు ప్రశ్నించింది. కక్ష సాధించేందుకు, అధికార దుర్వినియోగానికి ఈ సెక్షన్ వాడుతున్న సందర్భాలు ఉన్నాయని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సి ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 124 A వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తుంది అనే విషయంలో దాఖలైన మిగతా పిటిషన్లను కూడా దీంతోపాటే కలిపి విచారిస్తామని పేర్కొంది. 

Also Read టీమిండియాలో కరోనా వైరస్ కలకలం.. ఇద్దరు క్రికెటర్లకు పాజిటివ్

Tags:    

Similar News