తమిళనాడు ఎన్నికలు.. మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ భేటీ

Update: 2020-11-30 10:53 GMT

తమిళనాడులో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రజనీ మక్కళ్‌ మండ్రం-ఆర్‌ఎంఎం నిర్వాహకులతో రజనీకాంత్‌ సమావేశమయ్యారు. రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన అధికార, ప్రతిపక్షాలు ఈ సమావేశంపై దృష్టి పెట్టాయి. సరికొత్త అంచనాలు, విశ్లేషణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెర దించారు. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించినా.. పార్టీ ప్రారంభించలేదు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

రజనీ మక్కళ్‌ మండ్రం బలోపేతానికి రజనీకాంత్‌ చర్యలు చేపట్టారు. జిల్లాలవారీగా నిర్వాహకులతో తరచూ సమావేశాలు, ఆన్‌లైన్‌ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ ప్రారంభానికి బలమైన పునాదులు వేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రజనీ రాజకీయ అరంగేట్రం ప్రకటన తర్వాత.. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీ స్థాపించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించి ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చారు. రజనీకాంత్‌ మాత్రం 2021 శాసనసభ ఎన్నికలే లక్ష్యమని వెల్లడించారు. శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి రజనీకాంత్‌పై నిలిచింది.

రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన పుట్టినరోజు డిసెంబరు 12న ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అంతలో మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో నేడు సమావేశం కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత కొన్ని నిర్ణయాలు వెల్లడిస్తారనే ప్రచారం జరుగుతోంది.


Tags:    

Similar News