Union Budget 2022 : కేంద్ర బడ్జెట్ : ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే..!
Union Budget 2022 : ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కేంద్ర బడ్జెట్.. కొన్నిటికి ఊరటనిస్తే.. మరికొన్ని రంగాలను నిరాశపర్చింది.;
Union Budget 2022 : ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కేంద్ర బడ్జెట్.. కొన్నిటికి ఊరటనిస్తే.. మరికొన్ని రంగాలను నిరాశపర్చింది. దీని ప్రభావంతో కొన్ని వస్తువుల రేట్లు అందుబాటులోకి రానుండగా.. మరికొన్నిటి ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. ప్రజలు సాధారణంగా వినియోగించే అన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. ఇంపోర్టెడ్ ఐటమ్స్ మరింత కాస్ట్లీ కానున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరానికి 39లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలాసీతారామన్. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. పలు వస్తువులు మరింత చౌక కానుండగా.. మరికొన్ని వస్తువులు మరింత ప్రియం కానున్నాయి.
కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఛార్జర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌక కాబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కొత్త బడ్జెట్ ప్రకారం బట్టల ధరలు తగ్గనున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించారు. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. మిథనాల్ సహా కొన్ని రసాయనాల రేట్లు దిగివస్తాయి. స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఏడాది పాటు ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లు, వినికిడి పరికరాలు, వ్యవసాయ ఉపకరణాలు, కోకా బీన్స్, ఇంగువ లాంటివి చౌక కానున్నాయి.
కొత్త బడ్జెట్ ప్రకారం.. ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు మరింత పెరగున్నాయి. దిగుమతి చేయబడే అన్ని వస్తువులు ఇక మరింత ప్రియం అవుతాయి. గొడుగులపై భారీగా సుంకాలను పెంచడంతో వీటి ధరలూ భారీగా పెరుగుతాయి. క్రిప్టో లావాదేవీలపై 30శాతం ట్యాక్స్ విధిచండంతో.. క్రిప్టో టాన్సాక్షన్స్ మోత మోగించనున్నాయి. ఇక ఇమిటేషన్ జ్యువెలర్స్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్, ఎక్స్‌రే మెషిన్స్ ధరలు పెరగనున్నాయి.