Uttarakhand : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా..!
Uttarakhand : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.;
ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగం ప్రకారం... ఆరు నెలల కాలంలో శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. సెప్టెంబరు 5తో ఈ గడువు ముగుస్తోంది. అయితే ఇప్పట్లో ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి ఉంది. దీంతో, రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసారు.
గత మూడ్రోజులుగా తీరత్ సింగ్ రావత్..... బీజేపీ అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇప్పటికే భేటీ అయిన ఆయన.. ఇవాళ మరోసారి నడ్డాను కలిశారు. ప్రజాప్రతినిధుల చట్టం-1951 ప్రకారం ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేనందున.. రాజీనామా చేయాలని నడ్డా ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. హల్ద్వానీ, గంగోత్రి శాసన సభ స్థానాలు ఖాళీగానే ఉన్నా...ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో తీరత్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఆయన స్థానంలో మరో కీలక నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కాగా తీరత్ సింగ్ ప్రస్తుతం పౌరీ గర్వాల్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.