రజనీ వెళ్లారుగా.. విజయ్ వస్తారేమో.. తమిళ తంబీల చర్చ
మొత్తానికి నేను రాజకీయాల్లోకి ఇప్పుడైతే రావట్లేదు.. ఇక ముందు వస్తానో కూడా లేదో తెలియదు.. అని దేవుడు శాసిస్తే;
ఈసారి సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అనుకుంటుండగానే ఆయనకు బీపీ పెరిగింది. డాక్టర్లు ఈ సమయంలో విశ్రాంతి ఎక్కువ అవసరం అని చెప్పారు. అనవసర విషయాలు నెత్తిన వేసుకోవద్దని కూతుళ్లు కూడా నాన్నకి నచ్చజెప్పారు. మొత్తానికి నేను రాజకీయాల్లోకి ఇప్పుడైతే రావట్లేదు.. ఇక ముందు వస్తానో కూడా లేదో తెలియదు.. అని దేవుడు శాసిస్తే ఈ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడు అని ఫ్యాన్స్‌కి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
మరి తమిళనాడు పరిస్థితి ఏమిటి.. ఓ సినీ నటుడు వస్తాడు తమిళ రాజకీయాలను సమూలంగా మార్చేస్తాడు.. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజలకు రజినీ తప్పుకున్నాడు కాబట్టి విజయ్ వస్తే బావుండని ఆశిస్తున్నారు. ఇదే టాపిక్‌పై తమిళనాట ఆసక్తికర చర్చ నడుస్తోంది.
విజయ్ తన పార్టీ పేరును ఎన్నికల సంఘంలో కూడా రిజిస్టర్ చేయించినట్లు వార్తలొచ్చాయి. పీపుల్స్ మూమెంట్ సంస్థ పెట్టి సామాజిక కార్యక్రమాలతో దూసుకుపోతున్న విజయ్ పార్టీ పేరు ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కంగా విజయ్ పార్టీ పేరు ఉండనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
గత కొద్ది రోజులుగా రాజకీయాలపై దృష్టి సారించి ఏం జరుగుతోందో గమనిస్తున్న విజయ్ రజనీ పార్టీ పెడుతున్నాడని తెలిసి వెనక్కి తగ్గారని, ఇప్పుడు అది క్యాన్సిల్ అవడంతో విజయ్ ఎంట్రీ ఇస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం పళని స్వామిని కలిసిన విజయ్‌ని రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు. ఈనెల 31న విజయ్ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే మరోపక్క కమల్ హాసన్ కూడా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఏది ఏమైనా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట ఊహించని పరిణామాలు చోటు చేసుకోనున్నాయనేది మాత్రం వాస్తవం.