Bhawanipur bypoll : మొదలైన పోలింగ్.. దీదీ, ప్రియాంక మధ్య టఫ్ ఫైట్ ..!
Bhawanipur bypoll : పశ్చిమబెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. భవానీపూర్, జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.;
పశ్చిమబెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. భవానీపూర్, జాంగీపూర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రధానంగా మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఈ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది. భవానీపూర్‌తోపాటు జాంగీపూర్, సంపేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుంది. అక్టోబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు.
గతంలో బెంగాల్‌లో ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గంలో 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన దీదీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి ఆమె బరిలోకి దిగింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించారు. దీదీపై న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బీజేపీ పోటీకి నిలిపింది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆరు నెలల్లో ఏదో ఒక సభనుంచి ఆమె చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుభతా బక్షి.. దీదీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన జంగీర్‌పూర్ నుంచి బరిలో నిలిచారు. భవానీపూర్‌లో మొత్తం లక్షా 11వేల 283 మంది పురుష, 95వేల 209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.