అస్సాం,బెంగాల్‌లో నేడు రెండో దశ పోలింగ్..!
కొవిడ్ మహమ్మారి భయపెడుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ తొలి దశలో భారీగా పోలింగ్ నమోదుకాగా.. రెండో దఫాలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి.;
అస్సాంలో 39, బెంగాల్‌లో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలకు నేడు పోలింగ్ జరగనుంది. కొవిడ్ మహమ్మారి భయపెడుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ తొలి దశలో భారీగా పోలింగ్ నమోదుకాగా.. రెండో దఫాలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తే అవకాశాలు ఉన్నాయి. పలు కీలక స్థానాలపై ఆసక్తి నెలకొంది. బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్-వామపక్షాలు-ఐఎస్‌ఎఫ్ కూటమి తరఫున సీపీఎం నుంచి యువ నేత మీనాక్షి ముఖర్జీ బరిలో ఉన్నారు. దెబ్రాలో ఇద్దరు మాజీ ఐపీఎస్ ఉన్నతాధికారులు ముఖాముఖి తలపడనున్నారు. బీజేపీ తరఫున భారతీ ఘోష్, తృణమూల్ నుంచి హమయూన్ కబీర్ బరిలో ఉన్నారు.
అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఎన్డీయేలో అసోం గణ పరిషద్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ భాగస్వామ్య పక్షాలుగా ఉండగా.. మహాజోత్‌లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఏఐయూడీఎఫ్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్-బీపీఎఫ్, వామపక్షాలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. బరాక్ లోయలోని 15 కీలక నియోజకవర్గాలకు తాజా దశలో పోలింగ్ జరగనుంది. పథర్‌కాండీ, అల్గాపుర్ స్థానాల్లో బీజేపీ-ఏజీపీ మధ్య, మజ్‌బాత్, కలాయిగావ్‌ల్లో బీజేపీ-యూపీపీఎల్ మధ్య స్నేహపూర్వక పోటీ నెలకొంది.