Legal Validity of Will : సాదా కాగితంపై రాసిన వీలునామా చెల్లుతుందా? చట్టం ఏం చెబుతోంది?
Legal Validity of Will : కుటుంబాల్లో ఆస్తిపాస్తుల పంపకం అనగానే పెద్ద రచ్చ జరుగుతుంటుంది. మన పెద్దలు తమ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలనేది ఒక కాగితం మీద రాసి పెడుతుంటారు. అయితే చాలామందికి ఒక అనుమానం ఉంటుంది.. లాయర్ దగ్గరికి వెళ్లకుండా, కోర్టు స్టాంపు పేపర్ వాడకుండా కేవలం ఒక సాదా కాగితం మీద రాసి సంతకం పెడితే అది చెల్లుతుందా? లేదా? అని. భారతీయ వారసత్వ చట్టం ప్రకారం దీనికి సమాధానం అవును అనే. కానీ, ఆ కాగితం చట్టబద్ధం కావాలంటే ఒక ముఖ్యమైన కండిషన్ ఉంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం.
రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్వాలేదు.. కానీ!
భారతీయ వారసత్వ చట్టం ప్రకారం, ఒక వీలునామా రాసేందుకు ఖరీదైన స్టాంపు పేపర్లు వాడాల్సిన అవసరం లేదు. దానికి ఒక ప్రత్యేకమైన ఫార్మాట్ అంటూ ఏమీ లేదు. ఒక తెల్ల కాగితం మీద పెద్దలు తమ చేతిరాతతో ఆస్తుల వివరాలు రాసి, ఎవరికి ఏది చెందాలో స్పష్టంగా పేర్కొంటే అది చెల్లుతుంది. దీనిని రిజిస్ట్రేషన్ చేయించడం కూడా తప్పనిసరి కాదు. అయితే, కేవలం రాసి సంతకం పెడితే సరిపోదు. చట్టం దృష్టిలో ఆ కాగితం వీలునామాగా మారాలంటే ఇద్దరు సాక్షుల సంతకాలు ఖచ్చితంగా ఉండాలి.
సాక్షులు లేకపోతే ఆ కాగితం చెత్తతో సమానం
వారసత్వ చట్టం-1925లోని సెక్షన్ 63 ప్రకారం, వీలునామా రాసే వ్యక్తి సంతకం చేయడంతో పాటు, ఆ సంతకం చేస్తున్నప్పుడు కనీసం ఇద్దరు సాక్షులు అక్కడ ఉండాలి. ఆ సాక్షులు కూడా సదరు కాగితంపై సంతకాలు చేయాలి. ఒకవేళ వీలునామా రాసిన వ్యక్తి అన్ని వివరాలు రాసి, సంతకం చేసినా.. అక్కడ సాక్షుల సంతకాలు లేకపోతే కోర్టు దానిని గుర్తించదు. అంటే, ఆ కాగితం ఒక వీలునామాగా పనికిరాదు. అప్పుడు ఆ వ్యక్తి వీలునామా రాయకుండానే మరణించినట్టు చట్టం పరిగణిస్తుంది.
వారసత్వ చట్టం ప్రకారం పంపకాలు
ఒకవేళ సాక్షులు లేని వీలునామా దొరికితే, అందులో రాసిన మాటల ప్రకారం ఆస్తి పంపకం జరగదు. అప్పుడు ఆస్తి ఎవరికి చెందాలనేది హిందూ వారసత్వ చట్టం లేదా సంబంధిత వ్యక్తి మతపరమైన వారసత్వ చట్టాల ప్రకారం నిర్ణయిస్తారు. అంటే చట్టబద్ధమైన వారసులందరికీ సమానంగా వాటాలు వెళ్తాయి. అందుకే పెద్దలు సాదా కాగితం మీద రాసినా సరే, ఇద్దరు నమ్మకస్థులైన సాక్షుల సంతకాలు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల భవిష్యత్తులో కోర్టు గొడవలు, కుటుంబ కలహాలు రాకుండా ఉంటాయి.