Chitra Ramkrishna: ఎన్‌ఎస్‌ఈ సెల్ఫ్‌ లిస్టింగ్‌లో చిత్రకు సలహాలిచ్చిన యోగి ఎవరు?

Chitra Ramkrishna:

Update: 2022-02-19 10:52 GMT

Chitra Ramkrishna: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ వ్యవహారం సెబీ అధికారులకు కూడా అంతుపట్టడం లేదు.. ఆమెను కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రేరేపించిన ఆ హిమాలయ యోగి ఎవరనేది అధికారులు తెలుసుకోలేకపోతున్నారు.. తాజాగా ఎన్‌ఎస్‌ఈ సెల్ఫ్‌ లిస్టింగ్‌ వ్యవహారంలో చిత్రకు ఆ యోగి సలహాలు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. సెబీ దర్యాప్తులో ఇంకా చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి... 2015లో డిసెంబరు 4న ఆ అపరిచిత యోగి నుంచి చిత్ర రామకృష్ణకు వచ్చిన మెయిల్‌ను సెబీ అధికారులు పరిశోధించారు. ఆ మెయిల్‌లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.


ఏదైనా విషయాన్ని తలపెడితే దానిపై మన అజెండా ఏంటనేది నిరంతరం ఆలోచించుకోవాలని అపరిచిత యోగి చెప్పుకొచ్చారు.. సెల్ఫ్‌ లిస్టింగ్‌ గురించి గట్టిగా చెప్పాలంటే అవసరమైతే కొందరి తలుపు తట్టాలని సలహా ఇచ్చారు.. ఆర్థికమంత్రి, పీఎంవో అధికారి, కేబినెట్‌ సెక్రెటరీ, ఆర్థిక సలహాదారు.. చివరకు ప్రధాని ఇంటికి కూడా వెళ్లాలంటూ చిత్రకు సూచించారు.. ఆర్థిక శాఖ కూడా ఎన్‌ఎస్‌ఈ సెల్ఫ్‌ లిస్టింగ్‌పై ఒత్తిడి తెస్తోందని సెబీని నమ్మించాలని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తూ ఎంజాయ్‌ చేయ్‌ అంటూ ఆ యోగి సూచన చేసినట్లు మెయిల్‌లో సెబీ గుర్తించింది.

అంతేకాదు, ఆ అజ్ఞాత యోగి చెప్పినందువల్లే ఆనంద్‌ సుబ్రమణ్యన్‌కు ఎన్‌ఎస్‌ఈలో చిత్రా రామకృష్ణ కీలక పదవులు కల్పించినట్లు సెబీ అధికారులు గుర్తించారు.. ఆనంద్‌ సుబ్రమణ్యన్‌కు స్టాక్‌ మార్కెట్‌లో ఏమాత్రం అనుభవం లేనప్పటికీ గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, అడ్వైజర్‌గా నియమించారు.. 2016లో చిత్ర ఎన్‌ఎస్‌ఈ సీఈవోగా తప్పుకున్న తర్వాత ఈ వ్యవహారం బయటకు రావడంతో సెబీ విచారణ జరిపింది.. చిత్ర హయాంలో జరిగిన అవకతవకలపై 190 పేజీలతో భారీ నివేదిక రూపొందించింది.. ఈ విచారణలోనే ఆ యోగి అంశం బయటికొచ్చింది.


మరోవైపు చిత్రా రామకృష్ణపై ఇంత స్థాయిలో ప్రభావం చూపిన ఆ హిమాలయ యోగి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.. జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే.. ఆ యోగి, ఆనంద్‌ సుబ్రమణియన్‌ ఒకరేనా అనే అనుమానం కలుగుతోంది.. ఇదే విషయంపై అటు సెబీ, ఇటు సీబీఐ కూడా ఆరా తీస్తోంది. అన్ని కోణాల్లో విచారణ జరిపి ఆ మర్మయోగి కథేంటో బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రా రామకృష్ణపై నమోదైన పాత కేసులపై అధికారులు మళ్లీ దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News