Bangladesh Student leader: ఐరోపా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ విద్యార్థి నేత అరెస్ట్

ఢాకాలో పోలీస్ అధికారి హత్య కేసులో నిందితుడిగా గుర్తింపు

Update: 2026-02-19 05:30 GMT

బంగ్లాదేశ్‌ లో గతేడాది జరిగిన ఓ హిందూ పోలీసు అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడిని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు అహ్మద్ రజా హసన్ మెహదీ భారత్ మీదుగా ఐరోపాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని బంగ్లాదేశ్‌ కు డీపోర్ట్ చేశామని అధికారులు తెలిపారు.

కేసు  డీటైల్స్ ..

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన రోజు దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. హబిగంజ్‌ లోని బానియాచాంగ్ పోలీసు స్టేషన్‌పై ఆందోళనకారులు జరిపిన దాడిలో సబ్ ఇన్ స్పెక్టర్ సంతోష్ చౌదరి ప్రాణాలు కోల్పోయారు. సంతోష్ చౌదరి హత్యకు తానే బాధ్యుడినని మెహదీ గతంలో ఒక వీడియో ద్వారా ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

హబిగంజ్‌ లో విద్యార్థులు, గ్రామస్థులు భారీ ర్యాలీగా వెళ్తుండగా పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపగా.. ఆందోళనకారుల్లో ఆరుగురు మరణించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు స్టేషన్‌ ను చుట్టుముట్టి నిప్పు పెట్టారు. ఆ సమయంలో లోపల చిక్కుకున్న సంతోష్ చౌదరిని అల్లరి మూకలు బయటకు లాగి, తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనంతరం ఆయన మృతదేహాన్ని ఒక చెట్టుకు వేలాడదీశారు.

సంతోష్ చౌదరికి వివాహమైన ఏడాది లోపే ఈ దారుణం జరిగింది. ఆయన హత్యకు గురైన మూడు నెలల తర్వాత సంతోష్ భార్యకు కుమారుడు జన్మించాడు. పసికందు ముఖం చూడకుండానే ఆ అధికారి అల్లరి మూకల చేతిలో బలైపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ అధికారులు మెహదీని విచారిస్తున్నారు.

Tags:    

Similar News