Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్‌ను తిప్పికొట్టే ప్రయత్నం.. ప్రజలకు డబ్ల్యూహెచ్‌ఓ గుడ్ న్యూస్..
Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోన్న వేళ W.H.O గుడ్ న్యూస్ చెప్పింది.;
Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోన్న వేళ W.H.O గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మరో టీకా వినియోగానికి పచ్చజెండా ఊపింది. నొవావాక్స్ టీకాకు అత్యవసర అనుమతి మంజూరు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికా సంస్థ తయారు చేసిన ఈ టీకాను భారత్‌లో కొవొవాక్స్ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఈ టీకా గ్లోబల్ వ్యాక్సిన్-షేరింగ్ సిస్టమ్ కొవాక్స్‌లో భాగంగా పంపిణీ కానుంది.
కరోనా కొత్త వేరియంట్‌లు వెలుగుచూస్తున్న వేళ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు టీకాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపింది W.H.O. తక్కువ ఆదాయం గల 41 దేశాల్లో ఇప్పటికీ 10 మంది కూడా టీకాలు పొందలేకపోయారని.. 98 దేశాలు 40 శాతం కూడా తీసుకోలేదని W.H.O సీనియర్ అధికారిణి మరియాంజెలో సిమావ్ తెలిపారు. ఈ అనుమతితో ఆయా దేశాల్లో మరింత మంది టీకాలు పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
నొవావాక్స్ టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. ఈ టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు ఆసంస్థ పేర్కొంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలిందని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లకు భిన్న సాంకేతికతతో నొవాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు సీరమ్ వెల్లడించింది.