Language Controversy: భగ్గుమంటున్న భాషా వివాదం.. మరోసారి తెరపైకి..

Language Panel: హిందీ భాషా వివాదం మరోసారి రాజుకుంది. బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును క్రమంగా తప్పించాలని అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది.

Update: 2022-10-12 07:38 GMT

Language Controversy: హిందీ భాషా వివాదం మరోసారి రాజుకుంది. ఐఐటీలాంటి ఉన్నత సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థల్లో నుంచి బోధనా మాధ్యమంగా ఇంగ్లీషును క్రమంగా తప్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. కోర్టుల్లోనూ ఇంగ్లీషు స్థానంలో హిందీని చేర్చాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించింది. ఐతే ఈ సిఫార్సుల మీద దక్షిణాది రాష్ట్రాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిపార్సులో ఫైర్ అయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్‌. దేశంలో హిందీయేతర రాష్ట్రాల పౌరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరించి బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్ సైతం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని లేఖలో పేర్కొన్నారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం దేశ సమగ్రతను నాశనం చేస్తుందన్నారు. అలాంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సైతం ఈ సిపార్సులపై ట్విట్టర్‌ వేదికగా ఫైర్ అయ్యారు. ఇండియాకు జాతీయ భాష లేదని..గుర్తింపు పొందిన అధికారిక భాషల్లో హిందీ ఒకటని పేర్కొన్నారు.ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరి చేయడం అంటే సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనన్నారు. భారతీయులకు భాషను ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్నారు. సే నో టూ హిందీ ఇంపోజిషన్ అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News