Bangladesh: ఆర్థిక సంక్షోభం అంచులకు భారత్ చుట్టుపక్కల దేశాలు.. ముందుగా..
Bangladesh: భారత్ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి.;
Bangladesh: భారత్ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా.. పాకిస్థాన్ దివాలా అంచుకు చేరింది. మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్‌ఔట్ ప్యాకేజీ కోసం వెళ్లింది. రానున్న మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరింది. మరోవైపు బంగ్లాదేశ్ పాలకులు మాత్రం ఆర్థికంగా దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.
తక్కువ వడ్డీతో లభించే రుణాలను అవసరాలకు వాడుకోవడానికి ఓ మార్గంగా వాడుకొంటున్నట్టు సమర్థించుకుంటుంది బంగ్లాదేశ్. కానీ, వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. 416 బిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే 33వ స్థానంలో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం, సర్వీస్ సెక్టార్లపై ఆధారపడి ఉంది.
జీడీపీలో 56శాతం ఉన్న దేశ సర్వీస్ సెక్టార్ కొవిడ్ కారణంగా బాగా దెబ్బతింది. దీంతో 11లక్షల మంది నిరుద్యోగులయ్యారు. ఢాకా ఐఎంఎఫ్ వద్ద 4.5 బిలియన్ డాలర్ల రుణంతో పాటు పలు సంస్థల వద్ద అప్పుల కోసం యత్నిస్తోంది బంగ్లా. ప్రపంచ బ్యాంక్ వద్ద బిలియన్ డాలర్ల రుణం కోసం యత్నాలు చేస్తోంది. వివిధ సంస్థల నుంచి 2.5 బిలియన్ డాలర్ల రుణం కోసం ట్రై చేస్తోంది.
ఇక జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ నుంచి కూడా రుణం కోసం యత్నిస్తున్నట్లు అట్లాంటిక్ కౌన్సిల్ కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద ఉన్న రిజర్వులు కొన్ని నెలల విదేశీ చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఎగుమతులు పెరిగి విదేశీ కరెన్సీ రిజర్వులు పుంజుకోకపోతే ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.