Britain PM Elections : రిషి సునక్ లాస్ట్ పంచ్ వర్కౌట్ అవుతుందా..?
Britain PM Elections : బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది;
Britain PM Elections : బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది. కన్జర్వేటివ్ పార్టీలో లిజ్ ట్రస్‌తోపాటు భారత సంతతికి చెందిన రిషి సునాక్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. ఇప్పటికే పలు సర్వేల్లో సునాక్ కంటే ట్రస్ ముందంజలో ఉన్నట్టు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రుషి సునాక్ కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. బ్రిటన్‌ను ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దేందుకు పగలు, రాత్రి పని చేస్తానని శపథం చేశారు. సునాక్ ప్రతిజ్ఞ హాట్‌టాఫిక్‌గా మారింది.
ప్రపంచంలో ఉత్తమ దేశంగా బ్రిటన్ మరింత ఎదగడానికి, కుటుంబం మొదలు బిజినెస్ స్థాపన వరకు..దేశప్రజల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తోందని సునాక్ అన్నారు. స్వల్పకాలంలో ఎదురయ్యే సవాళ్లను నిజాయితీగా, విశ్వసనీయ ప్రణాళికతో ఎదుర్కొంటేనే మనం అక్కడికి చేరుకోగలమని రిషి పేర్కొన్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ఆయన.. పన్నుల భారం లేని, ఉత్తమ ఆరోగ్యపథకం, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థలు ఉండడమే ముఖ్యమన్నారు. ఇలా బ్రిటన్‌ను ఉత్తమ దేశంగా నిలబెట్టేందుకు రాత్రి, పగలు కష్టపడతానన్నారు. ఇందుకోసం తాను అమితంగా ప్రేమించే దేశంతోపాటు పార్టీ విలువలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో ముందుకెళ్తానని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అటు ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడనుంది. శుక్రవారం సాయంత్రం వరకూ ఓటింగ్ జరగనుండగా.. మొత్తం లక్షా 60వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు..తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సోమవారం ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించి విజేతను ప్రకటించనున్నారు. అటు రిషి గెలుపును కాంక్షిస్తూ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.