Britain Queen : రాజరికం ఉట్టిపడేలా.. బ్రిటన్ రాణి అంత్యక్రియలు..
Britain Queen : రాజరికం ఉట్టిపడేలా కట్టుదిట్టమైన భద్రత నడుమ... లండన్ వీధుల్లో రాణి ఎలిజబెత్ అంతిమయాత్ర నిర్వహించారు.;
Britain Queen : బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 అంత్యక్రియలు ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్ పౌరుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో రాణి అంతిమయాత్ర జరిగింది. రాజరికం ఉట్టిపడేలా కట్టుదిట్టమైన భద్రత నడుమ... లండన్ వీధుల్లో రాణి ఎలిజబెత్ అంతిమయాత్ర నిర్వహించారు. సన్నిహితుల సమక్షంలో విండ్సర్ క్యాసిల్‌లో రాణి ఎలిజబెత్‌ను ఖననం చేశారు. గతేడాది కన్నుమూసిన రాజు ఫిలిప్ సమాధి పక్కనే ఎలిజబెత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు.
అంత్యక్రియలకు కనీవిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేసింది బ్రిటన్ ప్రభుత్వం. ముందుగా ... వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లోని క్యాటఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్‌కు తీసుకెళ్లారు. 2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 మరకత మణులు, 269 ముత్యాలు, 4 రూబీలు పొదిగిన రాణి కిరీటాన్ని.. ప్రస్తుతం ఆమె శవపేటికపై ఉంచారు. ఈ క్రమంలో రాణి పార్థివ దేహాన్ని తొలుత వెస్ట్‌మిన్‌స్టర్ అబేకు తీసుకెళ్లారు. అక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు. వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడున్న గంటను 96 సార్లు మోగించారు. రాణి ఎలిజబెత్ బతికి ఉన్న 96 ఏళ్లకు గుర్తుగా అన్నిసార్లు ఈ గంటను మోగించారు.
వెస్ట్‌మిన్‌స్టర్ అబే చర్చిలో ప్రార్థనలు పూర్తైన తర్వాత.. విండ్సర్ క్యాసిల్‌లో అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి భౌతిక కాయాన్ని తీసుకువెళ్లారు. రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజ్‌లో రాణి పార్థివ దేహాన్ని తరలించారు. చివరిసారిగా ఈ క్యారేజ్‌ను 1979లో లార్డ్ మౌంట్‌బాటెన్ అంత్యక్రియల్లో మాత్రమే ఉపయోగించారు. రాణి అంతిమయాత్రను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలివచ్చారు. ప్రజల్ని కట్టడి చేసేందుకు లండన్‌లో 36 కిలోమీటర్ల మేర బ్యారికేడ్లు నిర్మించారు.
రాణి ఎలిజబెత్ అంత్యక్రియల కోసం దాదాపు 71 కోట్లు ఖర్చు చేసింది బ్రిటన్ ప్రభుత్వం. 125 సినిమా థియేటర్లలో రాణి అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలికారు.