Sudan: సూడాన్‌లో రెండు వర్గాల మధ్య పోరు.. ఒక్కరోజే 168 మంది మృతి..
Sudan: ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 3 లక్షల మంది వరకు మృతి చెందగా.. 2.5 మిలియన్ల మంది జనం నిరాశ్రయులయ్యారు.;
Sudan: సూడాన్ దేశంలో వర్గ కలహాలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ప్రాంతాలను స్మశానాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలు. సుడాన్‌లోని డార్ఫర్ ప్రాంతంలో అరబ్బులు, అరబ్బుయేతరులగా విడిపోయిన వర్గాలు ఒకరుపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలంగా ఆ ఘర్షణలు జరుగుతున్నా.. ఆదివారం ఒక్కరోజే ఈ ఘర్షణల్లో 168 మంది మరణించడం సంచలనంగా మారింది.
కొంతకాలం క్రితం అరబ్బులు, అరబ్బుయేతరులు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. గత గురువారం వెస్ట్ డార్ఫర్ ప్రావిన్షియల్ రాజధాని జెనెనాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెనిక్‌లో గుర్తు తెలియని దుండగుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చడంతో ఘర్షణలు చెలరేగాయి. ఇక ఆదివారం క్రెనిక్‌లో ఆయుధాలతో దాడి చేసి ఇళ్లలో చొరబడి సొమ్మును దోచుకున్నారు. అనంతరం వాటిని తగలబెట్టారు.
ఈ ఘర్షణలు క్రెనిక్ నుండి జెనీనా ప్రాంతం వరకు చేరాయి. ముందుగా అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిపై కాల్పులు జరిపారు. హింసను పోలీసులు అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా.. అవి అదుపులోకి రాలేదు. అందుకే ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 3 లక్షల మంది వరకు మృతి చెందగా.. 2.5 మిలియన్ల మంది జనం నిరాశ్రయులయ్యారు. అందులో ఆదివారం ఒక్కరోజే 168 మంది మరణించగా.. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు.