Ukraine Russia: ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా కన్ను..
Ukraine Russia: దేశంలోని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో విరుచుకుపడుతోంది.;
Ukraine Russia: ఉక్రెయిన్ పై రష్యాదాడులను ముమ్మరంచేసింది. దేశంలోనిప్రధాన నగరాలను స్వాధీనంచేసుకునే లక్ష్యంతో విరుచుకుపడుతోంది. మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వకార్యాలయాలతోపాటు.. సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం వైపు నుంచి విరుచుకుపడుతోంది. మరోవైపు ఉత్తరం వైపు ఖర్కివ్, దక్షిణం వైపు ఉన్న మరియుపొల్ నుంచి ఉక్రెయిన్ బలగాలను చుట్టుముడుతున్నాయి.
ఉక్రెయిన్ దళాలను అష్టదిగ్భంధనం చేసి దేశాన్ని స్వాధీనంచేసుకునే పనిలో పడింది. రష్యా సేనలను ఉక్రెయిన్ దళాలు అడ్డుకుంటున్నాయి. యుద్ధట్యాంకులను సరిహద్దుల్లో అడ్డుకుంటూ రష్యాకు భారీ నష్టాన్ని కల్గిస్తున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఇవానో- ఫ్రాంకిస్క్ నగరంలోని విమనాశ్రయంపై రష్యా వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్ వెల్లడించారు.
ఈ విమానాశ్రయంపై ఇది మూడో దాడి. ల్వీవ్‌కు సమీపంలో రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. యవరివ్ జిల్లాలో ఉన్న మిలిటరీ ట్రైనింగ్ సెంటర్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో దాదాపు తొమ్మిది మంది చనిపోగా.. 57 మంది గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. 30 క్షిపణులతో ట్రైనింగ్ సెంటర్‌పై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆఫీసర్స్ వెల్లడించారు.
డొనెట్స్క్ ప్రాంతంలో ఓ రైలుపై బాంబు షెల్‌ను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన మరియోపోల్‌కు అందుతున్న సాయాన్ని రష్యన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఆహారం, మంచినీరు, ఔషధాల వంటి సామగ్రితో వెళుతున్న ట్రక్కులపైనా దాడులకు పాల్పడుతోంది.
నగరాన్ని వీడిచి వెళుతున్న పౌరులను కూడా అడ్డుకుంటోంది. కీవ్‌కు 20 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న వారిపై రష్యన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా 7 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. మరియోపోల్‌లో ఇప్పటి వరకు 1,500 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ కార్యాలయం ప్రకటించింది.
మృతులకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రష్యా దాడిలో పలు చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఉ్రకెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ వెల్లడించారు. యుద్ధంలో తమ సైనికులు 13 వందల మంది చనిపోయారని వివరించారు. అయితే ఈ యుద్దంలో 579 మంది పౌరులు మృతి చెందారని, వేలాదిమంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఉక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవ,రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే.. ఏర్పడే పరిస్థితులపై నాటో దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. జీవ ఆయుధాలను ప్రయోగిస్తే నాటో కూడా ఆలోచిస్తుందన్నారు పోలండా అధ్యక్షుడు. అమెరికా ఆధ్వర్యంలో ఉక్రెయిన్‌లో జీవ ఆయుధ ల్యాబ్‌లు నడుస్తున్నాయన్న రష్యా ఆరోపణపై అగ్రదేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెపంతో సామూహిక జనహనన ఆయుధాలను ప్రయోగించేందుకు పుతిన్ సిద్ధపడుతున్నారన్నది ఆరోపించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తో జెలెన్స్‌కీ మాట్లాడారు. జెరుసలెంలో పుతిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐక్యరాజ్యసమితి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఈ వారంలో ఉక్రెయిన్- రష్యా మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిన విషయం తెలిసిందే.