Ukraine Russia: ఉక్రెయిన్‌పై యుద్ధంలో వెనక్కి తగ్గిన రష్యా..

Ukraine Russia: ఉక్రెయిన్ సరిహద్దుల్లో గత మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.;

Update: 2022-02-16 02:01 GMT

Ukraine Russia: ఉక్రెయిన్ సరిహద్దుల్లో గత మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎపుడు ఏం జరగబోతుందో అనే ఆందోళన ప్రపంచమంతా నెలకొంది. బుధవారం రష్యా బలగాలు దాడికి దిగుతాయని తమకు పక్కా సమాచారం అందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టగా, మరోవైపు అమెరికా సైతం ఇదే హెచ్చరికను జారీ చేసింది.

ఇక ఉక్రెయిన్‌పై దాడి చేయడమే తరువాయి అన్న పరిస్థితుల్లో రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ బార్డర్‌ సమీపంలోనుంచి కొన్ని బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది. తమ బలగాలు సైనిక కసరత్తులు పూర్తిచేసి, వెనక్కి బయలుదేరాయని రష్యా రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు. మరోవైపు రష్యా ప్రకటనపై స్పందించిన ఉక్రెయిన్‌ .. తాము చేసిన దౌత్య ప్రయత్నాలతో ఫలితం కనిపించిందని పేర్కొంది.

తమ సరిహద్దు వెంబడి మిగిలిన రష్యా బలగాలనూ వెనక్కి రప్పించుకోవాలని డిమాండ్‌ చేసింది. అయితే బలగాల ఉపసంహరణను తాము ప్రత్యక్షంగా చూసినప్పుడే ఈ విషయాన్ని నమ్ముతాయని ఉక్రెయిన్‌ విదేశాంగమంత్రి తేల్చిచెప్పారు. రష్యా ఒక్కసారిగా వెనక్కి తగ్గడంలో పశ్చిమ దేశాల ఒత్తిడి కూడా పనిచేసింది. దౌత్యపరంగా పశ్చిమ దేశాల ప్రయత్నం ఫలించింది.

ఉక్రెయిన్‌పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా హెచ్చరిక కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెనక్కి తగ్గే చర్యల్లో భాగంగా రష్యా బలగాలను ఉపసంహరించుకుంటోందా? ఎంతమేర బలగాలను వెనక్కి రప్పించింది? ఎందుకు రప్పించింది? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఉక్రెయిన్‌పై యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలిగిపోయాయి.

Tags:    

Similar News