Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరంగా మారిన బాంబు దాడులు..
Ukraine Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరపోరు కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి ఇరు సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి.;
Ukraine Russia: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరపోరు కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి ఇరు సైన్యాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు కీలక నగరాలను వశం చేసుకోవాలని రష్యా బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో దీటుగా ఎదురుదాడి చేస్తోంది. రెండు దేశాలను యుద్ధం నుంచి వెనక్కి రప్పించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మరింత దూకుడు పెంచింది. ఉక్రెయిన్ లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై తెల్లవారుజామున రష్యా సైన్యం రాకెట్ల దాడులు నిర్వహించింది. దీంతో జపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్ అగ్నికీలల్లో చిక్కుకుంది.ఈ విషయాన్ని ఆ నగర మేయర్ ధృవీకరించారు. ఇది గనుక పేలితే చెర్నోబిల్ కంటే పదిరెట్లు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఉక్రెయిన్ కీలక నగరాలను వశం చేసుకునేందుకు రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఎనర్హోదర్‌ను స్వాధీనం చేసుకునేదిశగా కదులుతోంది. ఉక్రెయిన్‌కు నాలుగో వంతు కరెంట్ ఇక్కడి నుంచే ఉత్పత్తవుతంది. చెర్నిహివ్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందినట్లు చెర్నిహివ్ గవర్నర్ ప్రకటించారు. ఇటు ఖేర్సన్ నగరాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించిన పుతిన్ సైన్యం.. రాజధాని కీవ్‌పై పట్టుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఉక్రెయిన్ ప్రధాన నగర దాడుల్లో రష్యా దళాలకు, ఉక్రెయిన్ రెబల్స్ చేతులు కలిపారు. నేరుగా తనతోనే చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. అప్పుడే యుద్ధం ఆగే మార్గం దొరుకుతుందన్నారు. మరోవైపు యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. యుద్ధ విమానాలు, ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలను జెలెస్కీ కోరారు.
ఉక్రెయిన్ -రష్యా ప్రతినిధుల మధ్య బెలారస్ లో జరిగిన రెండో విడత శాంతి చర్చలు సానుకూలంగా సాగాయి. అయితే ఏకాభిప్రాయానికి రావపోవడంతో అసంపూర్తిగా ముగిశాయి. కల్లోలిత ప్రాంతాల నుంచి సాధారణ పౌరులను తరలించేందుకు ప్రత్యేక కారిడార్ల ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మరణిస్తుండడంతో ఈ నిర్ణయానికి ఇరుదేశాలు వచ్చాయి.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వలసలు పెరిగాయని UNO శరణార్థుల విభాగం తెలిపింది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా ఉక్రెయిన్‌ను వీడినట్లు పేర్కొంది. మరోవైపు UAE సహా పలు దేశాలు ఉక్రెయిన్ వలసదారులకు ఆశ్రయాన్ని నిరాకరిస్తున్నాయి. రష్యా దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా కష్టాలు పడుతున్నారు.