PPF Rules : ఒక్కరి పేరు మీద ఎన్ని పీపీఎఫ్ అకౌంట్లు ఉండొచ్చు? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

Update: 2026-02-27 07:00 GMT

PPF Rules : భారతదేశంలో పొదుపు అనగానే అందరికీ గుర్తొచ్చేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రభుత్వ గ్యారెంటీ, స్థిరమైన రాబడి, పన్ను మినహాయింపులు ఉండటంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే, పీపీఎఫ్ విషయంలో ఇప్పటికీ చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంది. ఎక్కువ ఖాతాలు తెరిస్తే ఎక్కువ డబ్బు జమ చేయవచ్చని, తద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చని భావిస్తుంటారు. కానీ ఈ పొరపాటు మీ పెట్టుబడికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు.

పీపీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి తన పేరు మీద భారతదేశం మొత్తం మీద కేవలం ఒక్క ఖాతా మాత్రమే కలిగి ఉండాలి. అది బ్యాంకులో అయినా లేదా పోస్టాఫీసులో అయినా సరే, ఒకే ఒక అకౌంట్ చెల్లుబాటు అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరవడానికి చట్టం అంగీకరించదు. ఒకవేళ మీరు వేర్వేరు బ్యాంకుల్లో పీపీఎఫ్ ఖాతాలు తెరిచినా, అవన్నీ మీ పాన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి కాబట్టి, ఎప్పుడైనా దొరికిపోయే ప్రమాదం ఉంది. అలా దొరికితే, అదనపు ఖాతాలను అక్రమంగా పరిగణించి, వాటిలో మీరు జమ చేసిన సొమ్ముకు ఎటువంటి వడ్డీ ఇవ్వకుండానే వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క అకౌంట్ మాత్రమే కొనసాగనిస్తారు.

పీపీఎఫ్ నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ మీరు మీ మైనర్ పిల్లల పేరు మీద అకౌంట్ తెరిచినా, ఆ పరిమితి మారదు. అంటే మీ స్వంత ఖాతా మరియు మీ పిల్లల ఖాతా రెండూ కలిపి కూడా ఏడాదికి రూ.1.5 లక్షల లోపే పెట్టుబడి పెట్టాలి. అంతకు మించి జమ చేసినా మీకు పన్ను మినహాయింపు లభించదు, పైగా ఆ అదనపు సొమ్ముపై వడ్డీ కూడా రాదు. అలాగే, పీపీఎఫ్ అకౌంట్‌ను జాయింట్‌గా (ఇద్దరు కలిసి) తెరవడానికి వీల్లేదు.

ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడం. పన్ను ప్రయోజనాలను కొందరు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ ఒక వ్యక్తి-ఒక ఖాతా అనే నిబంధనను పెట్టింది. ఒకవేళ మీరు ఏడాదికి రూ.1.5 లక్షల కంటే ఎక్కువ పొదుపు చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్, ఎన్పీఎస్ లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం మంచిది. తెలివిగా పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తును భద్రం చేసుకోండి.

Tags:    

Similar News