ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 17న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది. 14న ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ జిస్టస్ ఎస్. అబ్దుల్ నజీర్. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతో పాటు సీఎం సమాధానం ఇవ్వనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ-20 సదస్సులు జరగనున్న నేపథ్యంలో అంతకుముందే.. అంటే 25 లేదా 27న బడ్జెట్ సమావేశాలను ముగించనున్నారు. మధ్యలో 22న ఉగాది సందర్భంగా ఆ ఒక్క రోజు లేదా రెండు రోజులపాటు సెలవు ఇవ్వనున్నారు. విశాఖపట్నానికి తాను, తన కార్యాలయం తరలివెళ్లడంపై ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాల్లో కీలక ప్రకటన చేసే అవకాశముందంటున్నాయి వైసీపీ వర్గాలు.
3 రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆ పరిణామాల ఆధారంగా సీఎం ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇక.. ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఏడుగురి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఆ ఏడు స్థానాలకూ మార్చి మొదటివారంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ జారీ చేయనుంది. ఆ ప్రకటన వస్తే.. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఈ ఎన్నికలు ఉంటాయి. శాసనసభలో పార్టీలకున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఈ ఏడు స్థానాలూ అధికార పార్టీకే దక్కే అవకాశముంది.