Kalyan Ram : కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి హిట్టా ఫట్టా..?

Update: 2025-04-18 09:42 GMT

రివ్యూ : అర్జున్ సన్నాఫ్ వైజయంతి

ఆర్టిస్ట్స్ : విజయశాంతి, కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీ తదితరులు

ఎడిటర్ : తమ్మిరాజు

సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్

సంగీతం : అజనీష్ లోక్ నాథ్

నిర్మాతలు : అశోక్ వర్ధన్ ముప్పా, సునిల్ బలుసు

దర్శకత్వం : ప్రదీప్ చిలుకూరి

బింబిసార వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆ జోష్ ను కంటిన్యూ చేయడంలో తడబడ్డాడు. అయితే ఈ సారి అర్జున్ సన్పాఫ్ వైజయంతితో బ్లాక్ బస్టర్ కొడుతున్నా అనే కాన్ఫిడెంట్ తో కనిపించాడు. విజయశాంతి కీలక పాత్ర చేయడం.. టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అన్న కాలర్ ఎత్తిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ తేవడం అన్నీ సినిమాకు పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. మరి ఇవాళ విడుదలైన ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :

అర్జున్ (కళ్యాణ్ రామ్)కు తన తల్లి వైజయంతి (విజయశాంతి) అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి తన కొడుకును కూడా అలాగే చూడాలనుకుంటుంది. ఆమె భర్త నేవీ ఆఫీసర్. అర్జున్ ఐపీఎస్ ప్రిపరేషన్ లో ఉన్న టైమ్ లో ఓ ప్రమాదంలో చనిపోతాడు. కానీ అది హత్య అని భావించిన వైజయంతి తన ఉద్యోగానికి రాజీనామా చేసి భర్త మరణానికి కారణం తెలుసుకునేందుకు కోర్ట్ లో కేస్ వేస్తుంది. తల్లి బలవంతం చేయడంతో తిరిగి ప్రిపేర్ అయి ఆలిండియా స్థాయిలో 6వ ర్యాంక్ సాధిస్తాడు అర్జున్. అదే రోజు అనుకోకుండా ఓ హత్య చేస్తాడు. ఆ తర్వాత అతనో గ్యాంగ్ స్టర్ గా, మోస్ట్ డేంజరస్ క్రిమినల్ గా మారిపోతాడు. ఈ విషయం తెలిసిన తల్లి అతన్ని దూరం పెడుతుంది. మరోవైపు వైజయంతిని చంపడం కోసం కొందరు ప్రయత్నిస్తుంటారు. మరి వాళ్లెవరు.. అర్జున్ సడెన్ గా ఎందుకు క్రిమినల్ అయ్యాడు..? అతని తండ్రిని చంపింది ఎవరు..? వైజయంతి పై కక్ష కట్టిన క్రిమినల్స్ ఎవరు అనేది మిగతా కథ.

ఎలా ఉంది :

కొన్ని కథలు ఎలా ఉంటాయో ట్రైలర్ తోనే తేలిపోతుంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా ట్రైలర్ లోనే కథ మాగ్జిమం చెప్పాడు. తనలా పోలీస్ అవుతాడనుకున్న కొడుకు క్రిమినల్ కావడంతో అతన్ని దూరం పెట్టిన తల్లి అనే పాయింట్ ను అప్పుడే చెప్పారు. ఎందుకు క్రిమినల్ అయ్యాడు అనేది సినిమాలో చూడాలి. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. హీరోయిజంను ఎలివేట్ చేస్తూ తల్లి సెంటిమెంట్ ను రంగరించిన కథ. కథనం పరంగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను దాటి ఎక్కడా కనిపించదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఈ చిత్రానికి ఆయువు పట్టు. ఇలాంటి మూవీస్ లోమెలోడ్రామా కనిపిస్తుంది. బట్ ఇందులో అది కనిపించదు. ఐపీయస్ అయినా తల్లిగా తనలో కుమిలిపోతూ.. ఆ హుందాతనాన్ని నిలబెట్టుకుంటూ ఆమె ఉంటే.. తను క్రిమినల్ అవడం వల్ల అమ్మకు దూరమైనా ఆమె కోసం అనుక్షణం తపించే తనయుడుగా అతనూ ఓ పర్ఫెక్ట్ మీటర్ లో కనిపిస్తాడు.

ఇలాంటి చిత్రాల్లో హీరోయిన్ తో డ్యూయొట్ లు, రొమాన్స్ లు, ఐటమ్ సాంగ్స్ కామన్ గా చూస్తాం. ఈ చిత్రంలో ఈ మూడూ లేవు. హీరోకు ఆల్రెడీ పెళ్లైపోయినట్టుగానే మొదలుపెడతాడు. పేరుకు ఓ పాట ఉంది కానీ అదెవరికీ గుర్తుండదు. దర్శకుడు ఎంచుకున్న తల్లి కొడుకు పాయింట్ నుంచి ఎక్కడా డీవియేట్ కాలేదు. చివరికి హీరోయిన్ పాయింట్ ను అందులోనే ముడిపెట్టాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా సాగిపోతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. సూపర్బ్ కంపోజింగ్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లోనూ అదే టెంపో కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఎక్కడా డౌన్ కాదు. అదే పెద్ద ప్లస్ పాయింట్. క్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ ను అస్సలు ఊహించలేం. ఆ స్థాయిలో ఉంది. ఇలాంటి సన్నివేశాలను ప్రేక్షకులు కూడా అంగీకరించాలి. అప్పుడే కొత్తదనం కనిపిస్తుంది. రంగస్థలంలో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటించడం వల్ల ఆ చిత్రానికే హైలెట్ అయింది. క్లైమాక్స్ ఫైట్ లెంగ్తీగా ఉన్నా.. బానే ఉంటుంది.

నటన పరంగా విజయశాంతికి ఇది స్ట్రాంగ్ కబ్ బ్యాక్. సరిలేరు నీకెవ్వరులో ఆమె ఇమేజ్ ను సరిగా వాడలేదు. ఇందులో పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు దర్శకుడు. తనకో ఇంటర్డక్షన్ ఫైట్ తో పాటు ముంబైలో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను పెట్టాడు. ఇదే సెకండ్ హాఫ్ లీడ్ గా మారుతుంది. విజయశాంతి అద్భుతంగా నటించింది. కళ్యాణ్ రామ్ సెటిల్డ్ గా కనిపించాడు. విజయశాంతితో వచ్చే సన్నివేశాల్లో మెచ్యూర్డ్ నటన చూపించాడు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ ది పరిమిత పాత్ర. నటన అంతంత మాత్రమే. విలన్ గా సోహైల్ ఖాన్ స్టేచర్ సరిపోలేదు. అతని నటనా అర్థం కాదు. శ్రీకాంత్ పాత్ర హైలెట్ గా ఉంటే.. బబ్లూ పృథ్వీరాజ్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రలన్నీ ఆయా పాత్రలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటాయి.

ఇక ఈ చిత్రంలో మైనస్ అంటే సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకోవడం.. బలమైన విలన్ లేకపోవడం అని చెప్పాలి. అంత బలమైన హీరోకు కేవలం మూడు సీన్స్ కు పరిమితమైన పెద్ద విలన్ ఉండటం లోపం. ఉన్నవాళ్లంతా అతని నీడలుగా ఉండటం, వాళ్లకు అంత సీన్ లేకపోవడం లోటుగా కనిపిస్తుంది. అలాగే కొత్తదనం ఉన్న కథేం కాదు. క్లైమాక్స్ ను మరీ సాగదీశారు. అయినా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ను ఇష్టపడే మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కు ఇది మంచి ఛాయిస్ అనే చెప్పాలి.

టెక్నికల్ గా అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికే బ్యాక్ బోన్ లా ఉంది. పాటలు బాలేదు కానీ నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ చాలా చాలా బావుంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు ప్రదీప్ చిలుకూరికి ఇది రెండో సినిమా. అతనిలో ఓ మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు. ఫ్యూచర్ లో పెద్ద దర్శకుడయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే కాస్త కొత్తదనం ఉన్న కథలో, కథనాలో ఎంచుకుంటే ఇంకా బావుంటుంది.

ఫైనల్ గా : కమర్షియల్ విత్ ఎమోషన్స్

రేటింగ్ : 2.75/5

- బాబురావు. కామళ్ల

Full View

Tags:    

Similar News