Drago Review : డ్రాగన్ మూవీ ఎంటర్టైన్ చేసిందా.. ఇబ్బంది పెట్టిందా.. ?

Update: 2025-02-21 09:45 GMT

రివ్యూ : రిటర్న్స్ ఆఫ డ్రాగన్

ఆర్టిస్ట్స్ : ప్రదీప్ రంగనాథన్, అనుపమా పరమేశ్వరన్, కయాడు లోహర్, మిస్కిన్, జార్జ్ మార్యన్, గౌతమ్ మీనన్ తదితరులు

ఎడిటర్ : ప్రదీప్ ఇ రాఘవ్

మ్యూజిక్ : లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి

నిర్మాతలు : కలైపులి ఎస్. అఘోరం, కలైపులి ఎస్. గణేష్, కలైపులి ఎస్. సురేష్

దర్శకత్వం : అశ్వత్ మారిముత్తు

తెలుగు రిలీజ్ : మైత్రీ మూవీ మేకర్స్

లవ్ టుడే మూవీతో తమిళ్ లో ఓవర్ నైట్ ఫేమ్ అయిన కుర్రాడు ప్రదీప్ రంగనాథన్. ఈ చిత్రంలో తనే హీరో దర్శకుడు కూడా. తెలుగులో డబ్ అయితే ఇక్కడా మంచి పేరు వచ్చింది. అతను హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన సినిమా డ్రాగన్. తెలుగులో మంచి ప్రమోషన్స్ కూడా చేసుకుని ఇవాళ రిలీజ్ అయిందీ మూవీ. మరి డ్రాగన్ ఎలా ఉందో చూద్దాం.

ఇంటర్లో టాప్ స్కోర్ సాధించిన ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు డి రాఘవన్(ప్రదీప్ రంగనాథన్). కానీ ఆ అమ్మాయి తనకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టం అని చెబుతుంది. దీంతో ఇంజినీరింగ్ టాప్ కాలేజ్ లో జాయిన్ అయినా బ్యాడ్ గా మారి తన పేరును కూడా డ్రాగన్ అని మార్చుకుంటాడు. కాలేజ్ మొత్తం హీరోలా బిల్డప్ ఇస్తుంటాడు. అతనితో కీర్తి (అనుపమ ) ప్రేమలో పడుతుంది. కాలేజ్ తర్వాత చూస్తే 48 బ్యాక్ లాగ్స్ ఉంటాయి. అయినా ఇంట్లో పేరెంట్స్ ను మోసం చేస్తూ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని జాబ్ చేస్తున్నా అని చెబుతాడు. అటు జాబ్ చేస్తున్న తన లవర్ కీర్తి వద్దా డబ్బులు తీసుకుంటాడు. అసలే బాధ్యతా ఉండదు. దీంతో కీర్తి బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటుంది. ఆ టైమ్ లో తనకు ఓ ఫ్రెండ్ ద్వారా జాబ్ సంపాదించే మార్గం దొరుకుతుంది. కట్ చేస్తే మూడేళ్లలో ఆడి కార్, డూప్లెక్స్ ఇల్లు కొంటాడు. ఓ ధనవంతుడి కూతురు పల్లవి (కయాడు లోహర్)తో పెళ్లీ కుదురుతుంది. అప్పుడే అతని లైఫ్ లోకి తన కాలేజ్ ప్రిన్సిపల్ ఎంటర్ అవుతాడు. అప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది. అతను మళ్లీ కాలేజ్ కి వెళ్లి చదవాల్సి వస్తుంది. మరి ఇంత షార్ట్ టైమ్ లో అతనెలా ఎదిగాడు. మళ్లీ కాలేజ్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? అతని పెళ్లి అయిందా లేదా అనేది మిగతా కథ.

కొన్ని కథలు లేదా సినిమాలకు సంబంధించి ఇలా ఉంటుందని ముందే ప్రిపేర్ అవుతాం. డ్రాగన్ ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఏం ప్రిపేర్ అవుతారో.. అవన్నీ సినిమాలో ఉంటాయి. వీటితో పాటు అదనంగా మంచి ఎమోషన్స్ ను కూడా అందించాడు దర్శకుడు అశ్వత్ మారిముత్తు. కాలేజ్ అంతా ఆవారాగా తిరిగిన కుర్రాడు. తల్లితండ్రులను, స్నేహితులను మోసం చేస్తూ.. ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్లిపోతే.. ఆమె భర్తకంటే ఎక్కువ సంపాదించాలని అడ్డదారులు తొక్కడం.. ఆనక దొరికిపోయి చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా కాలేజ్ లో మిగిలి పోయిన సబ్జెక్ట్ లన్నీ ఒకేసారి పాస్ అయ్యేందుకు తంటాలు పడటం.. తన లాంటి స్టూడెంట్ ఉండకూడదు అంటూ ప్రతియేడాది కాలేజ్ ప్రిన్సిపల్ కొత్త స్టూడెంట్స్ కు చెప్పడం.. అందుకోసం హీరో కష్టపడి సాధించడం.. ఈ మధ్యలో పెళ్లి పేరుతో మరో అమ్మాయి జీవితంలోకి వస్తే తనతో ప్రేమలో పడి.. రిచ్ లైఫ్ లీడ్ చేయబోతున్నాడు అనుకున్న టైమ్ లో ప్రీ క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అక్కడి నుంచి ఎమోషనల్ గా టర్న్ అవుతుంది. నిజాయితీకి ఉండే విలువను తెలుపుతుంది. హీరో అంటే ఇలా కదా ఉండాల్సింది అనిపిస్తుంది. నిజానికి ప్రేక్షకులు అతను పాస్ కాగానే సినిమా అయిపోయింది అని భావిస్తారు. కానీ ఏదో లోటులా ఉంటుంది. ఆ లోటును చివరి 15 నిమిషాల్లో పూరించాడు. ఇంకా చెబితే డ్రాగన్ కాలేజ్ కు రిటర్న్ అయిన తర్వాత నుంచి సినిమా మరో స్థాయికి వెళుతుంది. ఎందుకంటే ఆ ఎపిసోడ్ నుంచి అతని మాజీ ప్రేయసి అనుపమ లెక్చరర్ గా ఎంట్రీ ఇస్తుంది.

మరి ఈ సినిమాలో మైనస్ లే లేవా అంటే ఉన్నాయి. ప్రథమార్థం కాలేజ్ ఎపిసోడ్స్ తో పాటు స్నేహితుల ఇల్లల్లో కాలక్షేపం చేస్తూ ఉన్న సన్నివేశాలు సాగదీసినట్టుగానూ.. కాస్త అరవ అతి జోడైనట్టుగానూ కనిపిస్తాయి. ఈ తరహా సీన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. అందుకే బోరింగ్ గా అనిపిస్తాయి. చూస్తున్నంత సేపూ బానే అనిపించినా.. కట్టిపేడే కథనంగా అనిపించదు. ఫేక్ సర్టిఫికెట్స్ వ్యవహారం ఎంత ప్రమాదకరమో చెప్పిన సీన్స్ చాలా చాలా బావున్నాయి. కొన్ని మైనస్ లు ఉన్నా.. కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ లాంటి మూవీ ఇది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ పేరుతో ఎక్కడా అసభ్యత, అశ్లీలత, ద్వందార్థాలూ లేకుండా నీట్ గా ఉంది.

నటన పరంగా ప్రదీప్ రంగనాథన్ కు ఇది టైలర్ మేడ్ రోల్ లా ఉంది. అక్కడక్కడా ఒకప్పటి ధనుష్ లా అనిపించాడు. అనుపమ పాత్ర చాలా బావుంది. తనూ అద్భుతంగా నటించింది. కయాడు లోహర్ గ్లామర్ కే పరిమితం అయింది. కాలేజ్ ప్రిన్సిపల్ గా డైరెక్టర్ మిస్కిన్ అద్భుతంగా సెట్ అయ్యాడా పాత్రకు. బాగా నటించాడు కూడా. హీరో తల్లితండ్రులుగా ఈ మధ్యే మనకు బాగా తెలిసిన మొహాలు ఉండటం.. వారి క్యారెక్టరైజేషన్స్ చాలా బావున్నాయి.ఫ్రెండ్స్ ఓకే. స్నేహ గెస్ట్ రోల్ చేసింది.

నేపథ్య సంగీతం బావుంది. పాటలు బావున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ పరంగా చూస్తే సినిమా చాలా చోట్ల ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. తమిళ్ లో ఫస్ట్ మూవీ ఓ మై కడవులే (తెలుగులో ఓరి దేవుడా గా విశ్వక్ సేన్ తో రీమేక్ చేశారు అదేదర్శకుడితో) తో ఫేమ్ అయిన అశ్వత్ మారిముత్తు ఈ సారి రెస్పాన్సిబుల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో వచ్చాడు. మరోసారి ఆకట్టుకున్నాడు.

ఫైనల్ గా : డ్రాగన్.. నిజాయితీతో ఎంటర్టైన్ చేస్తాడు

రేటింగ్ : 2.75/5

బాబురావు. కామళ్ల

Tags:    

Similar News