Pawan Kalyan రివ్యూ : హరిహర వీరమల్లు .. పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాడా..?

Update: 2025-07-24 07:47 GMT

రివ్యూ : హరిహర వీరమల్లు

ఆర్టిస్ట్స్ : పవన్ కళ్యాణ్,నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునిల్, సత్యరాజ్, సుబ్బరాజ్, నాజర్, రఘుబాబు తదితరులు

ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్

సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి

సినిమాటోగ్రఫీ :జ్నానశేఖర్, మనోజ్ పరమహంస

నిర్మాతలు :దయాకర్ రావు, ఏఎమ్ రత్నం

దర్శకత్వం : క్రిష్, జ్యోతికృష్ణ

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఎన్నడూ లేనంతగా స్వయంగా ప్రమోషన్స్ చేశాడు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ను ముందుగా క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టాడు. బాగా లేట్ కావడంతో అతను తప్పుకున్నాడు. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టుకున్నాడు. అనేక అవాంతరాలు, అనుమానాలు, ఆలస్యాల తర్వాత ఫైనల్ గా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరమల్లు ఎలా ఉన్నాడో చూద్దాం.

కథ :

ఈ కథ 15,16 శతాబ్దాల కాలంలో సాగుతుంది. ఆ కాలంలోని వీరమల్లు(పవన్ కళ్యాణ్) ఒక దొంగ. పెద్దలను కొట్టి పేదలకు పెడుతుంటాడు.మచిలీపట్నం ఓడరేవు నుంచి అక్రమంగా విదేశీయులు మన వజ్రాలు, మణులు తరలించుకుపోతుంటే వారిని దోచుకుంటాడు. ఆ విషయం తెలిసి పక్క రాజ్యపు వీరమల్లును ఆహ్వానిస్తాడు. అక్కడే అతను పంచమి(నిధి అగర్వాల్)ని చూస్తాడు. ఆ రాజు తను గోల్కొండ కోటకు చెందిన తానీషాకు పంపించే కప్ప(ట్యాక్స్) నుంచి కొన్ని వజ్రాలు దొంగిలించి, మళ్లీ తనకే ఇవ్వమంటాడు.అక్కడే పంచమి కూడా తను రాజు బందీగా ఉన్నానని తననూ తప్పించమంటుంది. అందుకు ఒప్పుకున్న వీరమల్లు.. ఆ ప్రయత్నంలో గోల్కొండ రాజుకు దొరికిపోతాడు. ఆ రాజు వీరమల్లు గురించి తెలుసుకుని తమ వద్ద నుంచి కొల్లగొట్టబడిన కోహినూర్ వజ్రాన్ని తీసుకు రావాలని కోరతాడు. అది ప్రస్తుతం ఔరంగజేబ్ వద్ద ఉంటుంది. అందుకు ఒప్పుకుని 'ఢిల్లీ ప్రయాణం' మొదలుపెడతాడు వీరమల్లు. మరి కోహినూర్ తెచ్చాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

ఆరేళ్లుగా రూపొందించిన సినిమా అంటే మాగ్జిమం కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తాం. ఇందులో కంటెంట్ ఉంది కానీ దానికి సరిపడా కాన్ ఫ్లిక్ట్ లేదు. క్వాలిటీ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. దీంతో సినిమాలో కొన్ని సీక్వెన్స్ బావున్నట్టు కనిపించినా కనెక్ట్ కాలేం అన్నట్టుగా రూపొందించారు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అయితే అప్పుడే నేర్చుకుంటున్న వారు చేశారా అనిపిస్తుంది. అంత పూర్ గా ఉన్నాయి. ఇవి సినిమా ఫ్లోను, ఎమోషన్ ను దెబ్బ తీశాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు ఈ బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పడం అంటేనే ఈ టెక్నికల్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి. ఆ అంశంపై పట్టు ఉన్న దర్శకుడూ ఉండాలి. ఈ రెండూ పూర్తిగా లోపించాయి.

ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ, ఓడరేవు ఫైట్, కుస్తీ ఫైట్, చార్మినార్ వద్ద ఫైట్.. ఇవి బాగా ఎంగేజ్ చేస్తాయి. ఆ మూడు ఫైట్ల చుట్టూ ఉన్న కంటెంట్ కూడా ఆకట్టుకుంది. జనం కోసం ఏం చేయడానికైనా ముందుకు దూకే వీరుడుగా ఇవి హీరోను ఎలివేట్ చేస్తాయి. దీంతో విజువల్ ఎఫెక్ట్స్ మైనస్ గా కనిపిస్తున్నా.. ఓకే అనిపించేశాయి. బట్ ఎప్పుడైతే ఢిల్లీ ప్రయాణం మొదలైందో అక్కడి నుంచి కథనం పూర్తిగా గాడి తప్పింది. అస్సలే మాత్రం అవసరం లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వీటిలో చాలా భాగం హీరోను పర్సనల్ గా మెప్పించాలని చేసినట్టుగానే కనిపిస్తాయి. దీనికి తోడు బ్లాక్ అండ్ వైట్ కాలంలో లాగా వాళ్లు గుర్రాలపై వెళుతుంటే నవ్వాపుకోలేం. అదీ క్వాలిటీ. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్, దాని చుట్టూ అల్లుకున్న 'హిందూ, ముస్లీం'కోటింగ్ కొంత వరకూ బానే ఉన్నా.. ఇవి ఆల్రెడీ 'ఛావా'లో చూశాం కదా అనిపిస్తాయి.పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఆ ఫైట్ మాత్రం అదిరిపోయింది. బట్ క్లైమాక్స్ మాత్రం అత్యంత చవకబారుగా, హాస్యాస్పదంగా ఉండటం దర్శకుడి భావదారిద్ర్యమే తప్ప మరోటి కాదు.

క్యారెక్టరైజేషన్స్ పరంగా చూస్తే హీరోయిన్ పాత్రను సిల్లీగా రాసుకున్నాడు. దాసిగా పరిచయమైన తను తర్వాత హీరోను మోసం చేసి ఆపై ఇంకేదో ఉద్దరించే ప్రయత్నాలు చేయడం బ్యాడ్ ఐడియా. సునిల్, సుబ్బరాజు, నాజర్, రఘుబాబు తో పాటు జయసుధ కొడుకు నిహార్ ల పాత్రలు కూడా అవుట్ డేటెడ్ ఐడియానే. అలాగని వారిని వాడుకున్నారా అంటే అదీ లేదు. బాబీడియోల్ ఆ పాత్రకు తగ్గ స్టేచర్ తీసుకురాలేకపోయాడు. సచిన్ ఖేద్కర్ ది మరో రొటీన్ రోల్.. గెటప్ మారిందంతే.పవన్ కళ్యాణ్ కూ నటన చూపించే అవకాశం ఏం లేదు. జస్ట్ యాక్షన్ సీన్స్ లో ఇరగదీయడం తప్ప పెద్దగా చేసింది లేదు. సత్యరాజ్ అండ్ టీమ్ దీ అదే పరిస్థితి.

టెక్నికల్ గా చూస్తే కీరవాణి సంగీతంలో పాటలు జస్ట్ ఓకే. నేపథ్య సంగీతం బావుంది. చాలా సీన్స్ ను బాగా హైలెట్ చేశాడు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ లోపాలు చాలానే కనిపిస్తాయి. డైలాగ్స్ బాలేదు. కాస్ట్యూమ్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు ఏఎమ్ రత్నం బ్యానర్ స్థాయికి తగ్గట్టుగా లేవు. ఫస్ట్ హాఫ్ వరకూ క్రిష్ డైరెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. అంత వరకూ భరించగలిగేలానే ఉంది. సెకండ్ హాఫ్ తోనే పెద్ద తంటా. సుదీర్ఘంగా సాగిన ఢిల్లీ ప్రయాణం ఆద్యంతం ఇబ్బందికరంగానే ఉంటుంది.

ఫైనల్ గా : ఢిల్లీ ప్రయాణంలో సుడిగాలిలో చిక్కిన వీరమల్లు

రేటింగ్ : 2.5/5

- బాబురావు. కామళ్ల

Full View

Tags:    

Similar News