Ashwin Babu : శివం భజే మూవీ రివ్యూ

Update: 2024-08-01 09:47 GMT

రివ్యూ : శివం భజే

ఆర్టిస్ట్స్ : అశ్విన్ బాబు, దిగాంగన సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు

ఎడిటర్ : చోటా కే ప్రసాద్

సంగీతం : వికాస్ బాడిస

సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర

నిర్మాత : మహేశ్వర రెడ్డి మూలి

దర్శకత్వం : అప్సర్

యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన సినిమా శివం భజే. అప్సర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మహేశ్వర రెడ్డి నిర్మించాడు. రిలీజ్ కు ముందు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాం అని గట్టి ప్రమోషన్స్ చేసుకున్న ఈ మూవీ ఈ గురువారం విడుదలైంది. మరి శివం భజే పూనకాలు తెప్పించిందా.. నీరసాలు రప్పించిందా అనేది చూద్దాం..

కథ :

చందు ( అశ్వన్ బాబు ) ఓ బ్యాంక్ లో రికవరీ ఏజెంట్. ఓ కార్ ను రికవర్ చేయడానికి వెళితే వారు అతనిపై తిరగబడతారు. వారిని కొట్టి మరీ ఇఎమ్ఐ కట్టిస్తాడు. అదే విధంగా మరో ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ శైలజ (దిగాంగన సూర్యవంశీ )ని ప్రేమలో పడతాడు. తనూ అతన్ని ప్రేమిస్తుంది. అంతా హ్యాపీ అనుకునే టైమ్ లో తను ఫస్ట్ కొట్టిన గ్యాంగ్ మరోసారి అతనిపై దాడి చేస్తారు. ఆ దాడిలో కంటి చూపు కోల్పోతాడు చందు. హాస్పిటల్ లో జాయిన్ అయితే ‘ఐ డొనేటర్ ’ దొరికాడని కొత్త కళ్లు అమర్చుతారు. అప్పటి నుంచి చందు ప్రవర్తనలో వింత మార్పులు చోటు చేసుకుంటాయి. సడెన్ గా తనకు ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి. దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దృశ్యాల్లో అతనికి కనిపించిన వాళ్లంతా మర్డర్ అయి ఉంటారు. మరి వాళ్లెవరు..? వారిని చంపిందెవరు.. ఎందుకు..? అలాగే ఇతని కళ్లతో వచ్చిన సమస్యేంటీ అనేది సినిమాలో చూడాలి.

ఎలా ఉంది..?

మన దేశంపై శతృదేశాలు దాడికి వ్యూహ రచన చేస్తాయి. అందుకోసం ప్రమాదకరమైన వ్యక్సిన్ తయారు చేసి అంతర్గతంగా గందరగోళం సృష్టించాలి. అప్పుడు సైన్యం ఫోకస్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు పాకిస్తాన్ సాయంతో చైనా అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించుకోవాలనుకుంటుంది. ఈ లైన్ తో స్టార్ట్ అయిన సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా హీరో దాన్ని ఛేదిస్తాడు అనుకుంటాం. కానీ అవేం లేకుండా రికవరీ ఏజెంట్ అంటూ రౌడీయిజం చేస్తుంటాడు. పైగా తనే ఆర్బీఐ నిబంధనల గురించి చెబుతుంటాడు. ఇక లవ్ ట్రాక్ ఎంత అవుట్ డేటెడ్ అంటే అంత అవుట్ డేటెడ్. అతనికి కళ్లు పోవడానికే ఫస్ట్ ఫైట్ పెట్టారనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. అతనికి ఓ కుక్క కళ్లు అమర్చుతారు. మెడిసిన్ లో దీన్ని బయోలాజికల్ ట్రాన్స్ ప్లాంటేషన్ అంటారట. జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడం. ఇది చాలాకాలంగా ఉందే. కాబట్టి కన్విన్స్ అవుతాం. బట్ కథ ఎంతకీ ముందుకు సాగదే. అతనికి కళ్లు అమర్చిన ఆ కుక్క పోలీస్ లకు ఎన్నో కేస్ లు ఛేదించడంలో సాయం చేసి డోగ్రీ అనే కుక్కది. కొన్ని హత్యలు జరుగుతున్నప్పుడు అక్కడే ప్రత్యక్షంగా ఉన్న ఆ కుక్కను కూడా చంపేస్తాడు హంతకుడు. అతన్ని ఛేదించే పనిలో ఉంటాడు మురళీ అనే పోలీస్. అలా కుక్క చనిపోవడానికి ముందు చూసినవన్నీ హీరోకు కనిపిస్తుంటాయి. వినిపిస్తుంటాయి. వాటి ద్వారా ఈ పాకిస్తాన్, చైనా కుట్రలు తెలుసుకుని మరో రూట్ లో వాటిని ఆపేస్తాడు. ఇదీ కథ. ఈ చివరి ఎపిసోడ్ లో శివుడి గ్రాఫిక్స్.. అంతకు ముందు పాక్, చైనాలను తిడితే అయిపోతుంది అన్నట్టుగా ఉంది.

స్క్రీన్ ప్లే సహనానికి పరీక్ష పెడుతుంది. రెండు గంటల సినిమానే అయినా మూడు గంటలు చూస్తున్నట్టు ఉంది. చాలా సీన్స్ సిల్లీగా కనిపిస్తాయి. దర్శకుడు చివర్లో ఆ కుక్క వల్లే ఈ కథ రాసుకున్నా అని చెప్పాడు. నిజానికి డోగ్రీ అనేది ఒరిజినల్ డాగ్. ఎంతోమంది క్రిమినల్స్ ను పట్టించింది. అలాంటి కుక్క నేపథ్యంలో రాసుకున్న కథను పవర్ ఫుల్ గా కాక పేలవంగా ముగించాడు దర్శకుడు. పవర్ ఫుల్ టైటిల్ కూడా వృథాఅయినట్టే.

నటీనటులు

అశ్విన్ బాబు ఈ పాత్రలో బానే సెట్ అయ్యాడు. దిగాంగన గ్లామర్ కు దూరంగా హుందాగా కనిపించింది. మురళీ శర్మ, అర్బాజ్ ఖాన్ పోలీస్ గా ఓకే. హైపర్ ఆది పంచులు బాగా పేలాయి. ఇతర పాత్రలన్నీ రొటీన్.

టెక్నికల్ గా

సినిమాకు బ్యాక్ గ్రౌండ్ బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది. చాలా వీక్ గా ఉన్న సీన్స్ లో కూడా ఏదో ఉందనిపించేలా ఓ రేంజ్ లో వాయించాడు సంగీత దర్శకుడు వికాస్. అవకాశం వస్తే కాస్త పెద్ద సినిమాల్లో కూడా పనితనం చూపించే సత్తా ఉన్నవాడులా ఉన్నాడు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. మాటలు ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ నేపథ్యం కొత్తగా ఉన్నా.. దాన్ని అంతే కొత్తగా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా వెరీ రొటీన్ సీన్స్ తో సాగితే.. సెకండ్ హాఫ్ లో చాలాసార్లు ‘ హెడ్ఏక్’ తెప్పించాడు.

ఫైనల్ గా : ఆ శివుడు కూడా కాపాడలేడేమో

రేటింగ్ : 2 / 5

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News