రివ్యూ : ఓ.జి
ఆర్టిస్టులు : పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్,శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్,తేజ్ సప్రూ, హరీష్ ఉత్తమన్ తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస
నిర్మాత : డివివి దానయ్య
దర్శకత్వం : సుజీత్
ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా పవన్ కళ్యాణ్ ఓ.జి చిత్రానికి భారీ హైప్ వచ్చింది. ఏకంగా యేడాది పాటు ఆలస్యంగా విడుదలైనా.. మూవీపై క్రేజ్ తగ్గలేదు. సుజీత్ డైరెక్షన్ లో డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ ఈ గురువారం విడుదలైంది. మరి అంచనాలను అందుకునేలా ఉందా లేదా అనేది చూద్దాం.
కథ :
జపాన్ లో పుట్టిన ఓజస్ గంభీర(పవన్ కళ్యాణ్)కొన్ని కారణాల వల్ల ముంబై వెళ్లే ఓడ ఎక్కుతాడు. అప్పటికే అతను అక్కడి సుప్రసిద్ధ గురువుల వద్ద అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉంటాడు. ఆ ఓడపై దొంగలు ఎటాక్ చేసి సత్యదాదా(ప్రకాష్ రాజ్)సంపదను దోచుకోవాలని ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాన్ని టీనేజర్ అయిన గంభీర అడ్డుకుంటాడు. అప్పటి నుంచి అతను సత్య దాదా వద్దే ఉండిపోతాడు. అతను ముంబైలో ఓ పోర్ట్ కట్టించి ఎందరికో ఉపాధి ఇస్తాడు.సత్యదాదాతో పాటు వచ్చిన స్నేహితుడు అతన్ని చంపాలని చేసిన అన్ని ప్రయత్నాలనూ గంభీర అడ్డుకుంటాడు. ముఠాలుగా విడిపోతారు. గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి.అయితే గంభీర సత్యదాదా కొడుకును చంపుతాడు. దీంతో బంధాలు తెగిపోతాయి.గంభీర ముంబై వదిలి వెళ్లిపోతాడు.15యేళ్ల తర్వాత అతను తిరిగి ముంబైలో అడుగుపెడతాడు. మరి ఈ 15యేళ్లు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, అతని వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలేంటీ..? అతను నిజంగా సత్యదాదా కొడుకును చంపాడా..? ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ముంబై రావడానికి కారణం ఏంటీ అనేది మిగతా సినిమా.
ఎలా ఉంది.? :
ఓ.జి .. 1940లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంతో మొదలవుతుంది.ఆ యుద్ధంలో జపాన్ లో పోరాడిన భారతీయుడికి పుట్టిన వ్యక్తే గంభీర. 1970ల కాలంలో అతను ముంబై చేరతాడు. 1993 కాలంలో ఈ సినిమా సాగుతుంది. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఈ కాలాన్ని కలుపుతూ గతంలో ఏం జరిగింది.. ఇప్పుడు జరుగుతున్న దానికి దానికీ గతానికి ఉన్న సంబంధం ఏంటీ..? అనే కోణాలను తెలుపుతూ కథనం సాగుతుంది. దర్శకుడు సుజీత్ బాగా రాసుకున్న కథ ఇది. తన అభిమాన హీరోను ఎలా ప్రెజెంట్ చేయాలనుకున్నాడో అలాగే చేశాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ పవన్ ను ఎలివేట్ చేశాడు. పవన్ ఇమేజ్, ఆరాకు తగ్గట్టుగా అతని పాత్రను డిజైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫాస్ట్ ఫేజ్ లో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంటెన్సిటీతో పాటు సెకండ్ హాఫ్ కు సరైన లీడ్ గానూ ఉంటుంది. ఈ సీన్ లో పవన్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బాగా పండింది.
సెకండ్ హాఫ్ మొదటి 20 నిమిషాలు మాత్రం నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది. తర్వాత కొంత సెంటిమెంట్ ను యాడ్ చేస్తూ సత్య దాదా కొడుకును పవన్ హత్య చేశాడా లేదా అనే సీన్స్ కొంత ల్యాగ్ అయినట్టు కనిపిస్తాయి. పైగా ఇదంతా ఎక్స్ పెక్టెడ్ గానే ఉంటుంది.ప్రీ క్లైమాక్స్ లో కొన్ని ఓల్డ్ మూవీస్ స్టైల్ నే ఫాలో అయ్యాడు దర్శకుడు. అయినా క్లైమాక్స్ అంతా సెట్ అవుతుంది. మొత్తంగా ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాక యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారందరికీ ఫీస్ట్ లాంటి మూవీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
మైనస్ ల పరంగా చూసుకుంటే.. ఇందులో బలమైన కథ కనిపించదు. ఉన్న కథ కొత్తదేం కాదు. ఒక మంచి వ్యక్తి.. అతనికి అండగా, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్లే తెగువ ఉన్న హీరో. ఈ పాత్రల మధ్యే కథను క్రియేట్ చేశాడు. సో.. కొత్త పాయింట్ కాదు. అలాగే బలమైన విలన్ కూడా లేడు. మొదట్నుంచీ హీరోనే అత్యంత బలవంతుడు. అలాంటి వాడికి ఇంకా పవర్ ఫుల్ విలన్ ను ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ ఉన్న విలన్ లో ఆ కెపాసిటీ కనిపించకపోవడంతో తేలిపోయిందా పాత్ర. విపరీతమైన ఫైట్లు, రక్తపాతం కొందరిని ఇబ్బంది పెట్టొచ్చు. ఇక ప్రభాస్ సాహో మూవీకి లింక్ చేసే అవకాశాలున్నాయి అనేలా ఒక్క సీన్ లో చిన్న హింట్ ఇచ్చాడు. చివర్లో సెకండ్ పార్ట్ కూడా ఉందనే చెప్పాడు. అది ఎప్పుడు అనేది అప్పుడే చెప్పలేం కానీ.. సెకండ్ పార్ట్ తీసేంత స్టఫ్ అయితే ఉంది.
నటన పరంగా చూస్తే పవన్ కు గన్స్, కత్తులు అంటే పర్సనల్ గానూ ఇష్టం. అందుకే ఈ ఓజస్ గంభీర పాత్రను ఓన్ చేసుకున్నాడు. కరెక్ట్ గా పాత్రగానే కనిపించేంత సహజంగా నటించాడు. సత్యదాదా పాత్రలో ప్రకాష్ రాజ్ నటన అద్భుతం. ప్రియాంకది తక్కువ నిడివి ఉన్న పాత్రే. తను ఓకే. జిమ్మీగా నటించిన సుదేవ్ నాయర్, తావ్ డే గా అభిమన్యు సింగ్ ఎక్కువ విలనీ పండించారు. శ్రీయారెడ్డి బాగా చేసింది. ఇతర పాత్రల్లో మిరాజ్కర్ గా తేజ్ సప్రూ, ధీనాగా హరీష్ ఉత్తమన్ ఆకట్టుకున్నారు. బట్ చాలా ఎక్స్ పెక్ట్ చేసిన ఇమ్రాన్ హష్మీ పాత్రే కాదు.. నటన కూడా తేలిపోయింది. అతని ఇంపాక్ట్ పెద్దగా కనిపించలేదు. అతనికంటే సౌరవ్ లోకేష్ ఇంకాస్త బెటర్ గా ఉన్నాడు. మిగతా పాత్రలన్నీ ఓకే.
టెక్నికల్ గా ఈ చిత్రానికి ఆఫ్ స్క్రీన్ లో సుజీత్ తర్వాత తమన్ హీరో. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్ట్స్ లెవల్ లో నిలిపాడు.నేపథ్య సంగీతం చాలా కొత్తగా ఉంది. పాటలూ అంతే. సినిమాటోగ్రఫీ బ్రిలియంట్. ఎడిటింగ్ ఓకే. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్ట్ వర్క్ అంతా ఆ కాలానికి తీసుకువెళ్లేంత నేచురల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా సుజీత్ సాహోతో తను ఎంత పెద్ద స్టార్ నైనా డీల్ చేయగలను అనిపించుకున్నాడు. ఈ సారి తన అభిమాన హీరోనే అద్భుతంగా ప్రజెట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. రాబోయే రోజుల్లో సుజీత్ నుంచి మరిన్ని మాసివ్ ఎంటర్టైనర్స్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అనిపించుకున్నాడు.
ఫైనల్ గా : ఒరిజినల్ బ్లాక్ బస్టర్
రేటింగ్ : 3.25/5
- బాబురావు కామళ్ల