కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించింది. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. మొత్తం 224 స్థానాలు ఉన్న కర్నాటక అసెంబ్లీ లో కాంగ్రెస్ 136 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీని సాధించింది. అధికార బీజేపీ కేవలం 65 స్థానాలతో సరిపెట్టుకొని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. కింగ్ మేకర్ కావాలని కలలు కన్న జేడీఎస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువగా 19 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. గత ఆరు నెలల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓడిపోయిన రెండో రాష్ట్రం కర్ణాటక. డిసెంబర్‌లో హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్... బీజేపీని మట్టికరిపించింది. ఇప్పుడు కర్నాటకలోనూ కమలం పార్టీని చిత్తు చేసింది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. దక్షిణాదిపై పట్టుకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఫలితాలు షాక్‌కు గురి చేశాయి.
గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ అదనంగా 56 స్థానాలను గెలుచుకుంది. అదే సమయంలో అధికార బీజేపీ 39 స్థానాలను కోల్పోయింది. జేడీఎస్ కూడా భారీగా ఓట్లు, సీట్లు కోల్పోయింది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఏకంగా 18 స్థానాలను కోల్పోయింది. ఓట్ల శాతంగా పరం చూస్తే కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో నిలిచింది. ఈసీ ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాలలో కాంగ్రెస్ 43.2 శాతం ఓట్లను సాధించింది. బీజేపీ 35.6 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగా.. జేడీఎస్ 13.3 శాతం ఓట్ షేర్‌ను సాధించింది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ అదనంగా 5 శాతం ఓట్లను సాధించింది.. అదే సమయంలో జేడీఎస్ ఐదు శాతం ఓట్లను కోల్పోయింది. కాంగ్రెస్ కేవలం ఐదు శాతం అదనపు ఓట్లతో ఏకంగా 56 స్థానాలను అధికంగా సాధించింది. జేడీఎస్ 5 శాతం ఓట్ల నష్టంతో 18 స్థానాలను కోల్పోయింది. ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోయినా బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. 0.65 శాతం ఓట్ల నష్టంతో బీజేపీ ఏకంగా 39 స్థానాలను కోల్పోయింది.
బెంగళూరు, కోస్టల్ కర్నాటక మినహాయిస్తే ఏ రీజియన్‌లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్ కర్నాటక, నార్త్ కర్నాటక, మైసూర్‌లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యాన్ని చూపింది. జేడీఎస్.. మైసూర్ మినహా మరే రీజియన్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేకపోయింది. హైదరాబాద్ కర్నాటక ప్రాంతంలో కాంగ్రెస్ హవా నడిచించి. హస్తం పార్టీ 26 స్థానాలను దక్కించుకొని తిరుగులేదనిపిచుకుంది బీజేపీ 10, జేడీఎస్ మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగాయి. మైసూర్ ప్రాంతంలో కాంగ్రెస్ 39 సీట్లు దక్కించుకొని సత్తా చాటింది. జేడీఎస్ కంచుకోటగా చెప్పుకునే ఈ రీజియన్‌లో కేవలం 14 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ ఆరు చోట్ల గెలుపొందింది. బాంబే కర్నాటక రీజియన్‌లో కాంగ్రెస్ 33 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 16 చోట్ల, జేడీఎస్ ఒక స్థానంలో గెలుపొందింది.
బెంగళూరు రీజియన్‌లో బీజేపీ పట్టు నిలుపుకుంది. 15 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. హస్తం పార్టీ ఇక్కడ 13 స్థానాలలో విజయం సాధించగా.. జేడీఎస్ అసలు ఖాతానే తెరవలేకపోయింది. కోస్తా కర్నాటకలోనూ బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది. ఈ రీజియన్‌లో 13 సీట్లలో కమలం పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా.. జేడీఎస్ ఇక్కడ కూడా బోణి కొట్టలేకపోయింది. మధ్య కర్నాటకలో కాంగ్రెస్ దూసుకుపోయింది. ఈ రీజియన్‌లో 19 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ ఐదు స్థానాలు.. జేడీఎస్ ఒక చోట విజయం సాధించాయి.
మొత్తానికి పట్టణ, నగర ప్రాంతాలలో బీజేపీ పట్టను నిలుపుకోగా.. గ్రామీణ ప్రాంత ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్‌కే జైకొట్టారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాలలో కాంగ్రెస్ దుమ్మురేపింది. చామరాజనగర్, మైసూర్, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు జిల్లాల్లో రాహుల్ పాదయాత్ర నిర్వహించగా.. ఆ జిల్లాల్లోని 36 స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన కర్నాటక ఎన్నికల్లో హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మొత్తం 13 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. బళ్లారి స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓటమి పాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. చివరి నిమిషంలో బీజేపీ నుంచి హస్తం గూటికి చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్... హుబ్లీ ద్వారాడా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రామనగర నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఓటమి పాలయ్యారు.
స్పీకర్, బీజేపీ నేత విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి సిర్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భీమన్న నాయక్ చేతిలో 8,712 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చిక్కబళ్లాపుర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ చేతిలో ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ 10,642 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ తిప్టూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనుకంజలో ఉన్నారు. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నుంచి.. హోంమంత్రి అశోకపై భారీ మెజార్టీతో గెలుపొందారు. వరుణ నుంచి సిద్ద రామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నుంచి విజయం సాధించారు. శిగ్గావ్ నుంచి పోటీ చేస్తున్న సీఎం బొమ్మై.. కాంగ్రెస్ అభ్యర్థి రహ్మద్‌ఖాన్‌పై 22వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గాంధీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ గుండురావ్ కేవలం 105 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు.. కొరటగెరె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి పరమేశ్వర విజయం సాధించారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బళ్లారి సిటీ నుంచి పోటీ చేసిన ఆయన భార్య అరుణ ఓటమి పాలయ్యారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు వెల్లువెత్తాయి. రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలతో సంబరాలలో పాల్గొన్నారు. కార్యకర్తలు టపాసులు పేలుస్తూ, బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పలువురు కార్యకర్తలు హనుమంతుడి వేషధారణలతో బజ్‌రంగ్ బలీ నినాదాలు చేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం కనిపించింది.
కాంగ్రెస్ విజయంపై రాహుల్‌గాంధీ స్పందించారు. కర్నాటకలో పెత్తందారులకు.. పేదలకు మధ్య యుద్ధం జరిగిందన్నారు. పేదల తరపున పోరాడిన కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. ఇది అందరి విజయం... కర్నాటక ప్రజల విజయం చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చి అన్ని వాగ్ధానాలను తప్పకుండా నెరవేరుస్తామని రాహుల్ చెప్పారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటక అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. కర్నాటకలో తమకు మద్దతు తెలిపిన వారందరికి ప్రధాని మోదీ ధన్యావాదాలు తెలిపారు.
ఓటమిని అంగీకరించిన బసవరాజ్ బొమ్మై.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి పూర్తి భాద్యత తనదేనని చెప్పారు. పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయని.. వాటన్నింటిని సరిచేసుకొని వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. గెలుపోటములు బీజేపీకి కొత్తకాదన్నారు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప. రెండు సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం.. ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. ఈ ఫలితాలతో బీజేపీ శ్రేణులు నిరుత్సాహ పడవద్దన్నారు.