Allahabad High Court: 100 ఏళ్ల వ్యక్తిని 42 ఏళ్ళ జైలు జీవితం తరువాత నిర్దోషిగా తేల్చిన యూపీ హైకోర్టు
విచారణలో జాప్యం, ప్రాసిక్యూషన్ లోపాలను ఎత్తి చూపిన హైకోర్టు
ఉత్తరప్రదేశ్‌లో 100 సంవత్సరాల వృద్ధుడికి దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత న్యాయం దక్కింది. 1982 నాటి హత్య కేసులో ఈ వృద్ధుడిని అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. నాడు ఒక భూవివాదం గొడవ ఒకరి హత్యకు దారితీసింది. యూపీలో 1982లో జరిగిన ఈ హత్య ఘటనలో మైకు అనే వ్యక్తి ప్రధాన నిందితుడు కాగా, ధనీరామ్, సత్తిదిన్ ప్రేరేపించినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసును విచారించిన హమీన్‌పూర్ సెషన్స్ కోర్టు 1984లో ధనీరామ్, సత్తిదిన్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది. సెషన్స్ కోర్టు తీర్పుపై 40 ఏళ్ల క్రితం వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. పిటిషన్ విచారణ దశలో ఉండగా, వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మైకు అరెస్టు కాలేదు. అప్పటి నుండి రామ్ బెయిల్‌పై బయట ఉన్నాడని గమనించిన హైకోర్టు, అతని బెయిల్ బాండ్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. కేసు అర్హతల ఆధారంగా, ముఖ్యంగా ప్రాసిక్యూషన్ ఆరోపణలను సహేతుకమైన సందేహానికి మించి నిరూపించడంలో విఫలమైనందున నిర్దోషిగా విడుదల చేసినట్లు కోర్టు పేర్కొంది. నిందితులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఆందోళన, అనిశ్చితి, సామాజిక పరిణామాలను విస్మరించలేమని డివిజన్ బెంచ్ పేర్కొంది.
ఈ కేసును హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ప్రధాన నిందితుడు మైకును అరెస్టు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. అనంతరం ధనీరామ్ అప్పీలుపై నిర్ణయంలో జాప్యం, ప్రాసిక్యూషన్‌లో లోపాలను ఎత్తి చూపిన న్యాయస్థానం అతడిని నిర్దోషిగా తేల్చింది. అతడి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దోషిగా తేల్చింది.