Indore : మధ్యప్రదేశ్ లో విషాదం.. కలుషిత నీరు తాగి 11 మంది మృతి
1,400 మందికి అస్వస్థత
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా పిలువబడే పట్టణంలో కలుషిత నీరు కారణంగా దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,400 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
పదేళ్ల ప్రార్థన ఫలం.. ఆరు నెలలకే ..
భగీరథపుర పరిధిలోని మరాఠీ మొహల్లాకు చెందిన సాధన సాహు అనే మహిళకు వివాహమైన పదేళ్ల వరకు సంతానం కలగలేదు. ఎన్నో గుళ్లు, గోపురాలు తిరిగి.. ప్రార్థనలు చేసిన తర్వాత ఆరు నెలల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. అయితే ఇంటికి సరఫరా అయిన మున్సిపల్ వాటర్ కలుషితం కావడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తాగే పాలలో కలుషిత నీళ్లు కలపడంతో ఆ పసివాడు తీవ్రమైన వాంతులు, విరేచనాల బారిన పడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. డాక్టర్లు ఆ చిన్నారి మరణించినట్లు ప్రకటించారు. "నా బిడ్డ వెళ్లిపోయాడు.. అధికారుల పాపం నా పసివాడిని బలి తీసుకుంది" అంటూ ఆ తల్లి విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ప్రస్తుతం ఆమె 10 ఏళ్ల కుమార్తె కూడా కడుపు నొప్పితో బాధ పడుతుండటం ఆ కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
పరిశుభ్రతకు మారుపేరు ఇండోర్ నగరం. అలాంటిది మంచి నీళ్ల పైప్‌లైన్‌లో డ్రైనేజీ వాటర్ కలిసింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీళ్ల పైప్‌లైన్‌లో కలుషిత నీరు కలుస్తుందని ప్రజలు మొర్ర పెట్టుకున్నా పట్టించుకోలేదు. వాస్తవంగా భగీరత్‌పుర పైప్‌లైన్‌ను మార్చడానికి 2025 ఆగస్టులోనే టెండర్ దాఖలు చేయబడిందని వర్గాలు తెలిపాయి. రూ. 2.4 కోట్ల అంచనా వ్యయంతో దాఖలైంది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఇంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
అధికారులపై వేటు..
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించడంతో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే జోనల్ ఆఫీసర్‌తో పాటు ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్ పనులు చేపడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పరిశుభ్రతలో నంబర్ వన్ అని చెప్పుకునే నగరంలో.. ప్రజలు తాగే నీరు కలుషితమై మారి ప్రాణాలు పోతుంటే ఆ వ్యవస్థలు ఎందుకు పని చేయడం లేదన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.