Pakistan clashes : వాయువ్య పాకిస్థాన్‌లో గిరిజన ఘర్షణలు
11 మంది దుర్మరణం;
పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి రెండు తెగల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోగల కుర్రమ్ జిల్లాలో ఈ ఘర్షణలు జరిగాయి. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. ఎవరూ గుంపులుగా బయటికి రాకుండా కర్ఫ్యూ విధించారు. శనివారం ఉదయం ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వారే లక్ష్యంగా కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు. ఈ విషయం జిల్లా అంతటా వ్యాపించి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల ఒకవర్గంపై మరో వర్గం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘర్షణలు 11 మందిని బలితీసుకున్నాయి.
పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో గత నెలలో కూడా సున్నీ, షియా ముస్లిం తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను మరువకముందే ఇప్పుడు మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎంతో కాలంగా సున్నీ, షియా తెగల ముస్లింలు కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తరచూ రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.