Bihar bridges : వంతెనలు కూలిపోవడంపై నితీష్ సర్కార్ యాక్షన్
16 మంది ఇంజినీర్లపై వేటు వేసిన బిహార్;
బిహార్‌లో వరుస వంతెనలు కూలిపోతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం 16 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సీనియర్ అధికారులు పేర్కొన్నారు. విచారణ కమిటీ తన నివేదికను జలవనరుల శాఖకు అప్పగించిన నేపథ్యంలో సంబంధిత ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే వంతెనలు కూలిపోతున్నట్లు విచారణలో తేలిందని జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగానే ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో నలుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్లు ఉన్నారు. అలాగే నితీష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ఆదేశించింది. నిర్మాణ వ్యయాన్ని దోషులుగా గుర్తించిన కాంట్రాక్టర్లపై విధించనున్నారు. వంతెనలు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణ అసమర్థమేనని పేర్కొంటూ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు తమ నివేదికలను సమర్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బిహార్‌లో గత 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి కేంద్రమంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది. ‘‘ఇది రుతుపవనాల సమయం. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. వంతెనలు కూలడానికి కారణం అదే. ఈ ఘటనలపై దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని ఆయన వెల్లడించారు.