8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకటన..చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ల పెంపు?
8th Pay Commission : 8వ వేతన సంఘం గురించి గత కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే టెన్షన్ నడుస్తోంది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31లోపు రిటైర్ అయ్యే వారికి కొత్త పే కమీషన్ ప్రయోజనాలు అందుతాయా లేదా అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ గందరగోళానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా కీలక వివరణ ఇచ్చింది. ఫైనాన్స్ యాక్ట్ 2025లోని కొన్ని నిబంధనలను చూసి చాలామంది పొరబడ్డారు. డిసెంబర్ 31, 2025 లోపు పదవీ విరమణ చేసేవారికి 8వ వేతన సంఘం వర్తించదేమో అని భయపడ్డారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో స్పష్టత ఇచ్చారు. వేతనాలు, అలవెన్సులు మరియు పెన్షన్ల సవరణపై సిఫార్సులు చేసే అధికారం 8వ వేతన సంఘానికి ఉందని, ప్రభుత్వం ఆ సిఫార్సులను ఆమోదించిన తర్వాతే మార్పులు జరుగుతాయని ఆయన తెలిపారు. కాబట్టి పాత, కొత్త పెన్షనర్ల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని, అందరికీ నిబంధనల ప్రకారమే ప్రయోజనాలు అందుతాయని తేల్చి చెప్పారు.
సివిల్ పెన్షన్ లేదా డిఫెన్స్ పెన్షన్ నిబంధనలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫైనాన్స్ యాక్ట్ 2025 కేవలం ప్రస్తుతం ఉన్న నిబంధనలకు చట్టబద్ధతను కల్పించింది తప్ప, ఎవరికీ అన్యాయం చేసేలా లేదని మంత్రి వివరించారు. అంటే 2025 డిసెంబర్ లోపు రిటైర్ అయినా, ఆ తర్వాత రిటైర్ అయినా.. వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కట్ ఆఫ్ డేట్ ప్రకారమే అందరికీ లాభం చేకూరుతుంది.
మరోవైపు 8వ వేతన సంఘం పనులు వేగవంతమయ్యాయి. తాజాగా దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సాధారణ ప్రజలు, ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి MyGov పోర్టల్‌లో 18 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిని ఉంచారు. మార్చి 16వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను ఇక్కడ పంచుకోవచ్చు. దీని ద్వారా ఉద్యోగుల జీతభత్యాల పెంపు, పెన్షన్ సవరణపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన వివరణతో రిటైర్మెంట్ దశలో ఉన్న ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. పెన్షన్ సవరణ అనేది కేవలం చట్టం పాస్ చేసినంత మాత్రాన అయిపోదని, దానికి నిర్దేశించిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్-2021 ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి డిసెంబర్ 2025 గడువుపై వస్తున్న వార్తలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.