Microsoft: మైక్రోసాఫ్ట్‌లో ‘ఇజ్రాయెల్’ ఆందోళనలు.. 18 మంది అరెస్టు
ఉద్యోగుల నిరసనలతో సమీక్షిస్తున్న టెక్ కంపెనీ..!;
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మారణహోమం సృష్టిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఈ దాడులు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు ఇబ్బందికరంగా మారాయి. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పాల్పడుతున్న దారుణాలపై అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు ఇటీవలే నిరసనకు దిగారు.
కంపెనీ రూపొందించిన టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్ సైన్యం దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఇజ్రాయెల్ సైన్యంతో ఉన్న సాంకేతిక సంబంధాలకు ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనలతో అప్రమత్తమైన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 18 మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
ఇజ్రాయిల్ సైన్యం గాజాలో కార్యకలాపాలు నిర్వహించడానికి, పాలస్తీనియన్లపై నిఘా కోసం తమ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడాన్ని నిరసిస్తూ మైక్రోసాప్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్‌లోని కంపెనీ తూర్పు క్యాంపస్‌ను ఉద్యోగులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. సంస్థ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న రెడ్‌మండ్ పోలీసులు ఆగస్టు 20న మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో ఆందోళన చేస్తున్న 18 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మైక్రోసాఫ్ట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నట్లు తెలిసింది.
నిరసనలకు కారణం..
కాగా, ఉద్యోగుల నిరసనలకు ప్రధాన కారణం బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చిన ఓ కథనమే. ‘ఇజ్రాయెల్ ఆర్మీ ఐడీఎఫ్ మైక్రోసాఫ్ట్ ‘Azure క్లౌడ్ సర్వీసులు’ ఉపయోగించి గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనీయుల ఫోన్ కాల్స్‌ను పర్యవేక్షిస్తోందని పేర్కొంది. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం.. మైక్రోసాఫ్ట్-ఇజ్రాయెల్ రక్షణ శాఖ మధ్య బలమైన సంబంధాలున్నాయని తెలిపింది. 2023 అక్టోబర్‌లో జరిగిన హమాస్ దాడి తర్వాత.. ఇజ్రాయెల్ సైన్యంలో ఏఐ టెక్నాలజీ వినియోగం 200 రెట్లు పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం గూఢచర్యం, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్, డేటా విశ్లేషణ వంటి కార్యకలాపాల కోసం Microsoft Azure ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుందని, ఆ సమాచారం చివరికి AI ఆధారిత టార్గెట్ సిస్టమ్‌కు చేరుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ గతంలో చేసిన అంతర్గత దర్యాప్తులో అజూర్ లేదంటే ఏఐ వేదికలను ప్రజలకు హాని కలిగించేలా వాడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.
ఉద్యోగుల నిరసనలతో సమీక్షిస్తున్న టెక్ కంపెనీ..!
ఈ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది. దీనిపై ‘Covington & Burling’ అనే న్యాయ సంస్థ ద్వారా విచారణ చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ తన సర్వీస్ రూల్స్ ఈ విధమైన వినియోగాన్ని అనుమతించదని కంపెనీ స్పష్టం చేసింది. ఇది తీవ్రమైన విషయమని.. ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని కంపెనీ పేర్కొంది. కానీ, ఉద్యోగులు మాత్రం ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు. కేవలం విచారణ చేయడం సరిపోదని.. కంపెనీ ఇజ్రాయెల్‌కు టెక్నాలజీ మద్దతు తక్షణమే ఆపాలని కోరుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.