PM Kisan : పీఎం కిసాన్ 22వ విడత ముహూర్తం ఖరారు.. ఆ రోజే పైసలు పడతాయా?

Update: 2026-02-11 05:15 GMT

PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రాబోయే 22వ విడత నిధుల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2026 రెండో వారంలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.2,000 జమ కావచ్చని ప్రచారం జరుగుతోంది. హోలీ పండుగ కంటే ముందే రైతులకు ఈ పెట్టుబడి సాయం అందనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి మొదలైంది.

పథకం ఉద్దేశం.. నిధుల జమ ఇలా..

చిన్న, సన్నకారు రైతులు అప్పుల పాలు కాకుండా, విత్తనాలు, ఎరువులు, ఇతర ఇంటి ఖర్చుల కోసం ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. దీని కింద ఏటా రూ.6,000లను మూడు విడతల్లో (విడతకు రూ. 2,000 చొప్పున) అందిస్తారు. ఈ డబ్బులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే వస్తాయి. ఇప్పటివరకు 21 విడతలు విజయవంతంగా పూర్తయ్యాయి.

డబ్బులు ఎవరికి ఆగిపోతాయి?

అయితే, అందరు రైతులకు ఈ నిధులు అందవు. కొన్ని నిబంధనల వల్ల లక్షలాది మందికి డబ్బులు ఆగిపోయే ప్రమాదం ఉంది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి ఈ పథకం వర్తించకపోవచ్చు. అలాగే, ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందుతున్నా, లేదా ఒకరి కంటే ఎక్కువ మంది వయోజనులు ఈ సాయం తీసుకుంటున్నా అధికారులు తనిఖీలు చేపడతారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు వీరి నగదును హోల్డ్‌లో ఉంచుతారు. దీంతో పాటు ఆధార్ అనుసంధానం, ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయని వారికి కూడా ఈసారి డబ్బులు రావు.

మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

మీకు 22వ విడత వస్తుందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Know Your Status ఆప్షన్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా అవాంతరాలు ఉంటే eMitra చాట్‌బాట్ సహాయంతో కారణాన్ని తెలుసుకుని సరిదిద్దుకోవచ్చు. భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో ముందే చూసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News