Mumbai Rains: ముంబైలో భారీ వర్షం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
భారీ వర్షాలతో ముంబై నగరం పూర్తిగా జలమయం;
వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విఖ్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. విఖ్రోలిలోని జన్‌కల్యాణ్ సొసైటీలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఒక్కసారిగా ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో షాలు మిశ్రా, సురేశ్‌చంద్ర మిశ్రా అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆర్తి మిశ్రా, రితురాజ్ మిశ్రాలను రక్షించి రాజావాడి ఆసుపత్రికి తరలించాయి.
శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబైలోని గాంధీ నగర్, కింగ్స్ సర్కిల్ సహా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లపైకి భారీగా వరద నీరు చేరడంతో నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై, రాయ్‌గడ్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై పోలీసులు హెచ్చరించారు. నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయి, దారి సరిగా కనిపించని పరిస్థితులు ఉన్నాయని వారు తెలిపారు. అత్యవసర సహాయం కోసం 100, 112, 103 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
మరోవైపు, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని, అత్యవసర సాయం కోసం 1916 నంబరును సంప్రదించాలని కోరింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో శిథిలాలను పూర్తిగా తొలగించామని, ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించామని అధికారులు వెల్లడించారు.