Manipur horror: అకృత్య ఘటనలో నలుగురి అరెస్ట్‌

మణిపుర్‌ అమానుష ఘటనలో మొత్తం నలుగురి అరెస్ట్‌... ప్రధాన నిందితుడు 32 ఏళ్ల హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌గా గుర్తింపు;

Update: 2023-07-21 02:45 GMT

మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన(Manipur horror) లో మరో ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జీరో FIR నమోదు చేసిన 63 రోజుల తర్వాత, వీడియో బహిర్గతమైన ఒకరోజు తర్వాత ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే, తామే చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు(suo motu) హెచ్చరించిన తర్వాత నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మణిపుర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ ట్విట్టర్‌ పోస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని తౌబల్ జిల్లా(Thoubal district)లోని పేచీ అవాంగ్ లేకాయికి చెందిన 32 ఏళ్ల హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌( Huirem Herodas Singh)గా గుర్తించారు.


బహిరంగ గుంపులో వేలాది మంది పురుషులు ఉన్నారని, స్త్రీలకు తుపాకీ గురిపెట్టి బట్టలు విప్పేలా చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మే 3, 4 తేదీల్లో వెయ్యి మందితో కూడిన గుంపు తొమ్మిది గ్రామాలపై దాడి చేసి.. ఇళ్లను తగలబెట్టిందని చాలామందిపై దాడి కూడా చేసిందని వివరించారు. ఆ గుంపులో ఆరు సంస్థల సభ్యులుగా అనుమానిస్తున్న వ్యక్తులు ఉన్నారని, వారందరినీ గుర్తించామని FIRలో పేర్కొన్నారు. రెండు మూడు గంటలపాటు ఇలా నగ్నంగా ఊరేగించారని, గుంపును చెదరగొట్టినప్పుడు, అల్లరిమూక పారిపోయిందని బాధితులకు సంబంధించిన ఓ వ్యక్తి చెప్పాడు.


మణిపుర్‌లో వివిధ సంఘటలనకు సంబంధించి దాదాపు వెయ్యి కేసులు నమోదు అయ్యాయని అందుకే విచారణలో జాప్యం జరుగుతోందని పోలీసులు తెలపడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి కేసును గుర్తించడానికి సమయం పడుతుందని... అందుకే ఈ వీడియో దొరికిన వెంటనే విచారణ, పోలీసు చర్యలు మొదలయ్యాయని సీఎం బీరేన్‌సింగ్‌ అన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధిస్తామని, నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు.

వీడియో వైరల్ అయ్యేంత వరకు పోలీసులు మౌనంగా ఉండడాన్ని గవర్నర్ అనుసియా ఉకే ప్రశ్నించారు. తాను గవర్నర్‌గా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి అమానుష ఘటన జరిగిందంటే నమ్మలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదో తనకు తెలియాలని, డీజీపీకి ఫోన్ చేసి నివేదిక సమర్పించమని ఆదేశించానని గవర్నర్‌ తెలిపారు. భవిష్యత్తులో ఎన్నడూ మహిళలపై ఇలాంటి నేరాలకు పాల్పడే ధైర్యం ఎవరికీ ఉండకూడదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News