Indian Rupee : డాలర్‌కు రూ.92 దాకా వెళ్లినా..ఆరు నెలల్లోనే మళ్లీ పుంజుకోనుందట..ఎస్‌బిఐ సంచలన నివేదిక.
Indian Rupee : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకున్న కారణంగా బుధవారం రూపాయి విలువ పుంజుకున్నప్పటికీ, రాబోయే రోజుల్లో డాలర్ ముందు రూపాయి మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయిపై ఒత్తిడి తెచ్చే అంశాలు ఇంకా పూర్తిగా తొలగిపోకపోవడంతో, త్వరలోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.92 స్థాయికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ ఒత్తిడికి ప్రధాన కారణాలలో ఒకటి, అమెరికా 2025 ఏప్రిల్ 2 నుంచి అన్ని ఆర్థిక వ్యవస్థలపై భారీగా సుంకాలు పెంచడం. ఈ ప్రకటన తర్వాత భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 5.7 శాతం బలహీనపడింది. ఇది ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిలోకెల్లా అత్యధిక పతనం. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకోవడం, భూరాజకీయ అనిశ్చితులు కూడా రూపాయి పతనానికి దోహదపడుతున్నాయి.
అమెరికా విధించిన సుంకాల కారణంగా తీవ్రంగా బలహీనపడిన భారత రూపాయి, రాబోయే ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో (అక్టోబర్ 2026-మార్చి 2027) బలంగా పుంజుకునే అవకాశం ఉందని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్థిక పరిశోధనా విభాగం నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం, స్థిరత్వం పరంగా చూస్తే రూపాయి ఎక్కువ అస్థిరతకు లోను కాలేదని ఎస్‌బిఐ తెలిపింది. సుదీర్ఘ అనిశ్చితి, పెరుగుతున్న రక్షణవాదం, కార్మిక సరఫరా సమస్యలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ట్రేడ్ డేటా ద్వారా స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితులు, ట్రేడ్ డీల్‌లో ఆలస్యం కారణంగా ప్రస్తుతం రూపాయి విలువ తగ్గుదల దశలో ఉందని ఎస్‌బిఐ విశ్లేషించింది.
రూపాయి విలువ రూ.90 నుంచి రూ.91 స్థాయికి చేరడానికి కేవలం 13 రోజులు మాత్రమే పట్టింది. ఈ పతనాన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక మార్కెట్‌లో చురుకుగా జోక్యం చేసుకుంటోంది. తాజా గణాంకాల ప్రకారం.. జూన్-సెప్టెంబర్ 2025 మధ్య కాలంలోనే ఆర్‌బిఐ సుమారు 18 బిలియన్ డాలర్ల వరకు మార్కెట్‌లో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ,ఎక్స్ఛేంజ్ రేటులో హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ఆర్‌బిఐ జోక్యం చేసుకోవడం వలన, దేశ విదేశీ మారక నిల్వలు జూన్ 2025లో $703 బిలియన్ల నుంచి డిసెంబర్ 5, 2025 నాటికి $687.2 బిలియన్లకు తగ్గాయి.