Building Collapse: మొహాలీలో కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్.
20 ఏండ్ల యువతి దుర్మరణం;
పంజాబ్‌లోని మొహాలీలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో 20 ఏండ్ల యువతి మరణించింది. ఆమెను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన దృష్టి వర్మగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్‌మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం శనివారం సాయంత్రం కుప్పకూలింది. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృంధాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇప్పటి వరకు ఓ యువతి మృతదేహాన్ని వెలికి తీశామని, భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురిని రక్షించామని, అత్యవవసర చికిత్స నిమిత్తం వారిని దవాఖానకు తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కూలిపోయిన బిల్డింగ్‌లో జిమ్ కూడా నడుస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై బీఎన్‌ఎస్ 105 సెక్షన్ కింద భవన యజమానులు పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌లపై పోలీసులు కేసు నమోదుచేశారు.భవనం కూలిపోవడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.