Rare Earth Mining : రాజస్థాన్ ఎడారిలో 12.9 లక్షల టన్నుల అరుదైన ఖనిజాలు..వెలికితీసేందుకు జపాన్ టెక్నాలజీ.
Rare Earth Mining : రాజస్థాన్ ఎడారిలో అపారమైన నిధి బయటపడింది. అది బంగారం కాదు కానీ, అంతకంటే విలువైనది. అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ నిధిపై జపాన్ కన్ను పడింది. రాజస్థాన్ మట్టిలో దాగున్న ఈ అరుదైన ఖనిజాలను వెలికితీసేందుకు భారత్, జపాన్ దేశాల మధ్య కీలక చర్చలు నడుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, శక్తివంతమైన అయస్కాంతాలు, రక్షణ పరికరాల తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యాన్ని చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ రెండు దేశాలు చేతులు కలపబోతున్నాయి.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవలే రాజస్థాన్, గుజరాత్‌లలో మూడు భారీ హార్డ్ రాక్ రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నట్లు ప్రకటించారు. వీటిలో దాదాపు 12.9 లక్షల మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ ఆక్సైడ్ ఉన్నట్లు అంచనా. గతేడాది భారత్, జపాన్ దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. జపాన్ ఇప్పుడు రాజస్థాన్‌లోని ఈ నిల్వలపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తోంది. ఈ ఖనిజాలను వెలికితీసేందుకు తన నిపుణుల బృందాన్ని ఇక్కడికి పంపేందుకు ప్లాన్ చేస్తోంది.
రాజస్థాన్ మట్టి నుంచి ఈ ఖనిజాలను వేరు చేయడం అంత సులభం కాదు. హార్డ్ రాక్ నుంచి వీటిని తీయడానికి అడ్వాన్సుడ్ టెక్నాలజీ అవసరం. ప్రస్తుతం భారత్ వద్ద ఆ స్థాయి టెక్నాలజీ లేదు. అందుకే జపాన్ రంగంలోకి దిగింది. "మీకు సాంకేతికత, నిధులు మేము ఇస్తాం.. ప్రతిఫలంగా మాకు కావాల్సినంత ఖనిజాన్ని ఇవ్వండి" అని జపాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. దీనివల్ల అటు రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదాయం, ఇటు జపాన్ పరిశ్రమలకు ముడిసరుకు లభిస్తాయి.
జపాన్ ఇంతలా ఆరాటపడటానికి కారణం చైనాయే. ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ సరఫరాలో చైనానే రారాజు. ఇటీవల జపాన్‌కు చెందిన 20 సంస్థలకు ఎగుమతులను చైనా నిలిపివేసింది. దీంతో జపాన్ కంపెనీలు సందిగ్ధంలో పడ్డాయి. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని జపాన్ భావిస్తోంది. అదే సమయంలో భారత్ కూడా చైనా నుంచి దిగుమతులను తగ్గించి, సొంతంగా ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ సాంకేతికత భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
కేవలం రాజస్థాన్‌కే ఈ బంధం పరిమితం కావడం లేదు. భారత్, జపాన్ దేశాలు కలిసి ఆఫ్రికా ఖండంలో కూడా లిథియం, కాపర్, కోబాల్ట్ వంటి ఖనిజాల వేటను మొదలుపెట్టాలని భావిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో ఈ ఖనిజాలదే భవిష్యత్తు. రాజస్థాన్ ప్రాజెక్టు గనుక పట్టాలెక్కితే, ఆసియా ఖండంలో చైనా ఆధిపత్యానికి గండి పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.