Malegaon Blast Case: నేడు ముంబై కోర్టులో 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు తుదీ తీర్పు..
ఈ తీర్పుపైనే ఆధారపడిన ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ పురోహిత్ భవిష్యత్..;
2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు ఈరోజు (జూలై 31న) తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పుతో నిందితుల భవిష్యత్తు నిర్ణయించబడనుంది. అయితే, దాదాపు 17 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసు విచారణ.. అనేక చట్టపరమైన మలుపులు, సుదీర్ఘ విచారణకు ముగింపు పలికింది. అయితే, ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరితో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సుధాకర్ చతుర్వేది, అజయ్ రాహిర్కర్, శంకరాచార్య, సమీర్ కులకర్ణి లాంటి మరో ఐదుగురు నిందితులు విచారణను ఎదుర్కొన్నారు.
అయితే, 2008 సెప్టెంబర్ 29వ తేదీన మాలేగావ్‌లోని భికు చౌక్‌లో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన IED బాంబు కారణంగా ఈ పేలుడు సంభవించింది. తొలుత మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) విచారణ చేసిన తరువాత 2011లో కేసు ఎన్ఐఏకి అప్పగించింది. ఇక, పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరుపై రిజిస్టర్ చేయబడిందని ప్రాసిక్యూషన్ వాదించింది. NIA తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రసల్, కాల్ డేటా రికార్డులు, ఫోన్ కాల్స్, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పలు ఆధారాలను సమర్పించారు. అయితే, సుధాకర్ చతుర్వేది నివాసంలో దొరికిన RDX బాంబు కల్నల్ ప్రసాద్ పురోహిత్ ఆదేశాల మేరకే ఉపయోగించారని ప్రాసిక్యూషన్ కీలక వాదన చేసింది.
ఇక, డిఫెన్స్ ఈ ఆధారాలన్నింటినీ ప్రశ్నించింది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తరపున న్యాయవాది మోటార్ సైకిల్ ఛాసిస్ పూర్తిగా దెబ్బతిన్నదని.. యాజమాన్యం నిర్ధారణ సాధ్యం కాదని వాదించారు. కల్నల్ ప్రసాద్ పురోహిత్ న్యాయవాది విరాల్ బాబర్ తన క్లయింట్‌ను కావాలనే ఇరికించారని, తీవ్రంగా హింసించి ఈ కేసు ఒప్పుకునేలా చేశారని వాదనలు కోర్టుకు తెలిపారు. ఎలక్ట్రానిక్ కాల్ రికార్డులకు సెక్షన్ 65B సర్టిఫికేట్ లేకపోవడంతో అవి చట్టపరంగా ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు.
కాగా, 2018 డిసెంబర్‌లో విచారణ అధికారికంగా ప్రారంభం కాగా, 323 మంది సాక్షులను ఎంక్వైరీ చేయగా.. వారిలో 39 మంది వాంగ్మూలం మార్చగా, 26 మంది సాక్ష్యం చెప్పకముందే చనిపోయారు.. NIA MCOCA అభియోగాలను ఎత్తివేసినా, UAPA, IPC, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. నేడు చివరి నిర్ణయం ప్రకటించనుంది. ఇక, దేశవ్యాప్తంగా ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, ప్రసాద్ పురోహిత్ తదితరుల భవిష్యత్తు ఈ తీర్పుపైనే ఆధారపడి ఉంది.