Bengaluru Women: అనుమతి లేకుండానే ఇన్‌స్టాలో మహిళల వీడియోలు.. తరువాత ఏం జరిగింది అంటే
బెంగుళూరులో 26 ఏళ్ల వ్యక్తి అరెస్టు;
మహిళల అనుమతి లేకుండా వాళ్లకు చెందిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. 26 ఏళ్ల ఆ నిందితుడిని గుర్దీప్ సింగ్‌గా గుర్తించారు. బెంగుళూరులోని కేఆర్ పురం ఏరియాలో అతను ఉంటున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. నిరుద్యోగిగా ఉన్నాడు. బెంగుళూరు వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలను తీసి గుర్దీప్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ మహిళకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె ఫిర్యాదు చేయడంతో అతన్ని పట్టుకున్నారు. నిందితుడికి ఓ సోదరుడు ఉన్నాడు.
సెంట్రల్ బెంగుళూరులోని పాపులర్ కమర్షియల్ ప్రాంతమైన చర్చిగేట్ వద్ద ఎక్కువగా నిందితుడు వీడియోలు, ఫోటోలు తీశాడు. పబ్లిక్ స్థలాల్లో నడుచుకుంటు వెళ్తున్న వారిని, కెమెరాలను గుర్తించలేనివారిని వీడియోలు తీశాడు. వీధులను తీస్తున్నట్లుగా ఉన్నా.. అతను సీక్రెట్‌గా మహిళల్ని వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఇన్‌స్టా కాంటెంట్ పట్ల అప్రమత్తం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చర్చిగేటు వద్ద తిరుగుతున్న వ్యక్తి తమ అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడని ఆమె తన పోస్టులో ఆరోపించింది. తాను ఉన్న వీడియోకు ఆన్‌లైన్‌లో తీవ్ర అభ్యంతరకరమైన మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పిందామె.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసే పనిలో పడ్డారు. దీని కోసం మెటా సంస్థతో చర్చిస్తున్నారు. ఇటీవల బెంగుళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలకు చెందిన వీడియోలను పోస్టు చేసిన కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో హసన్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు కంపెనీలో అకౌంట్స్ శాఖలో పనిచేస్తున్న అతను.. మహిళల వీడియోలు తీసినట్లు అంగీకరించాడు. అతని ఇన్‌స్టా అకౌంట్లో 5వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్ను డిలీట్ చేశారు.