ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న రెస్క్యూ దళాలు సహాయక చర్యలు చేపట్టారు. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం జమ్ము నుంచి శ్రీనగర్‌కు ఆర్మీ కాన్వాయ్ వెళ్తున్నది. ఉదయం 11.30 గంటల సమయంలో జాతీయ రహదారి 44లోని బ్యాటరీ చష్మా ప్రాంతం సమీపంలో ఒక ఆర్మీ వాహనం అదుపుతప్పింది. 700 అడుగుల లోతైన లోయలోకి అది దూసుకెళ్లింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆర్మీకి చెందిన పలు కాగితాలు, వస్తువులు ప్రమాద స్థలం వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన సైనికులు, గాయపడిన వారిని పైకి చేర్చారు. మరణించిన జవాన్లను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్‌గా గుర్తించారు. గాయపడిన సైనికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.