Cloudburst In JK : జమ్ముకశ్మీర్‌ను మరోసారి ఆకస్మిక వరదలు..
నలుగురు మృతి- రైల్వే ట్రాక్ ధ్వంసం;
జమ్ముకశ్మీర్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని నలుగురు మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, 44వ జాతీయ రహదారితోపాటు కథువా పోలీస్ స్టేషన్ దెబ్బతిన్నది. ఆయా ప్రాంతాల్లో స్థానికులతోపాటు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్చల్లో పాల్గొన్నారు.
వరదలపై కేంద్ర మంత్రి, ఉధంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ స్పందించారు. జిల్లా ఎస్పీ శోభిత్ సక్సేనాతో ఫోన్‌లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరాతీశారు. ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. మరోవైపు, కఠువా క్లౌడ్ బరస్ట్‌పై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడి కొందరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు, అనేక మంది గాయపడిన ఘటనలపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలిపారు, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అవసరమైన అన్ని సహాయాలను హామీ ఇచ్చారు.
"ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో 2-3 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆరుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా దారిలో కొన్ని రోడ్లు కూడా కొట్టుకుపోయాయి" అని కఠువా డిప్యూటీ కమిషనర్ రాజేశ్ శర్మ తెలిపారు.
కాగా, ఇటీవల మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సహా ఇప్పటి వరకు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 82 మంది గల్లంతయ్యారు.