Madya Pradesh: నాలుగేళ్ల బాలుడికి రూ.53 లక్షల జాక్‌పాట్
రూ. 201 కూపన్‌తో రూ. 53 లక్షల విలువైన ఫార్చ్యూనర్ కారు
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. కేవలం రూ. 201 పెట్టుబడితో ఓ కుటుంబం ఏకంగా రూ. 53 లక్షల విలువైన లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఈ అనూహ్య సంఘటన మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జాక్‌పాట్ నాలుగేళ్ల బాలుడి రూపంలో ఆ కుటుంబాన్ని పలకరించింది.
బర్హాన్‌పూర్‌లోని శిలాంపుర ప్రాంతానికి చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ, సర్కార్ ధామ్ ఆధ్వర్యంలో అభాపురిలో జరిగిన గర్బా ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ ఆమె తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరు మీద రూ. 201 చెల్లించి ఒక ప్రైజ్ కూపన్ కొనుగోలు చేశారు. మరుసటి రోజు నిర్వాహకులు నిర్వహించిన లక్కీ డ్రాలో మేధాన్ష్ పేరు మీద కొన్న కూపన్‌కే బహుమతిగా ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కారు దక్కింది.
ఈ విషయం తెలిసి రాయిక్వార్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా కిరణ్ రాయిక్వార్ మాట్లాడుతూ "మా మనవడికి బొమ్మల కార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆడుకోవడానికి బొమ్మ కార్లనే అడుగుతాడు. కానీ ఈసారి ఏకంగా నిజమైన లగ్జరీ కారుకే యజమాని అయ్యాడు. కాగితాల ప్రక్రియ పూర్తయిన వెంటనే కారు మా ఇంటికి వస్తుంది. కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నాం" అని తెలిపారు.
మేధాన్ష్ పుట్టినప్పటి నుంచీ తమకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాడని, అందుకే ఇంట్లో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఏదైనా అతని పేరు మీదే కొంటామని కిరణ్ వివరించారు. ఈ సంఘటన తర్వాత చుట్టుపక్కల వారంతా మేధాన్ష్‌ను 'లక్కీ బాయ్' అని పిలుస్తున్నారని ఆమె ఆనందంగా చెప్పారు. మధ్యప్రదేశ్‌లో లాటరీలపై నిషేధం ఉన్నప్పటికీ, ఇలాంటి సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో నిర్వహించే లక్కీ డ్రాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం గమనార్హం.