LEAVE POLICY: జులై 1 నుంచి కొత్త లీవ్ పాలసీ..!
ఏటా 42 అదనపు సెలవులు మంజూరు చేయనున్నట్లు వార్తలు;
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 42 అదనపు సెలవులు మంజూరు చేస్తున్నట్లు, దీనికి సంబంధించిన కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ అదనపు సెలవులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీనా.. లేక ప్రత్యేకంగా కొంతమందికేనా అన్న విషయంలో గందరగోళం నెలకొంది. వాస్తవంగా అవయవాలను దానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 42 రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 2న లోక్‌సభ వేదికగా ప్రకటించారు. ఈ సెలవులను శస్త్రచికిత్సకు ముందు, ఆసుపత్రిలో చేరినప్పుడు, రికవరీ సమయంలో వినియోగించుకోవచ్చు. ఇది అన్ని అవయవ దాన శస్త్రచికిత్సలకూ వర్తిస్తుంది. అలాగే ఇది వైద్య సిఫార్సుల ఆధారంగా వన్-టైమ్ బెనిఫిట్. ఏటా ఇచ్చే సెలవులు కాదు. ఇది అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న చొరవ. సాధారణ సెలవు విధానం కాదు. అయితే పూర్తికాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరానికి 42 అదనపు సెలవులను మంజూరు చేసే కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి అమలులోకి వస్తోందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. పని-జీవిత సమతుల్యతను మెరుగుపరచడానికి ప్రస్తుత క్యాజువల్, ఆర్జిత, వైద్య సెలవులకు అదనంగా ఈ లీవ్స్‌ను ప్రభుత్వం ఇస్తోందంటూ నివేదించాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఆడవాళ్లకు ప్రత్యేక సెలవులు
ఈ ఆధునిక యుగంలో మగవారికి సమానంగా ఆడవాళ్లు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అయితే మగవాళ్లకు లేని కొన్ని సవాళ్లు ఆడవాళ్లకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు పడుతూనే పని చేయాల్సి వస్తోంది. అయితే ఈ బాధను అర్థం చేసుకున్న చాలా కంపెనీలు పీరియడ్స్ లీవ్స్ ఇస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా మెన్‌స్ట్రువల్ లీవ్ పాలసీపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా మహిళా ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం కొత్త మెన్‌స్ట్రువల్ లీవ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. స్తున్నట్లు మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. 55 ఏళ్ల లోపు వయసున్న మహిళా ఉద్యోగులు, ప్రతి నెల ఒక రోజు, అంటే ఏడాదికి మొత్తం 12 రోజులు పెయిడ్ మెన్‌స్ట్రువల్ లీవ్స్ తీసుకోవచ్చు. ఇవి ఇప్పటికే ఉన్న 10 రెగ్యులర్ క్యాజువల్ డే లీవ్స్, 5 స్పెషల్ క్యాజువల్ డే లీవ్స్‌తో పాటు అదనంగా లభిస్తాయి. అయితే ఒక నెలలో మహిళలు మెన్‌స్ట్రువల్ లీవ్ ఉపయోగించుకోకపోతే, అది వృథా అవుతుంది. దాన్ని తర్వాతి నెలలో వాడుకోవడం కుదరదు, ఆ సెలవు రద్దయిపోతుంది.