Leech Stuck In Throat : వ్యక్తి గొంతులో ఇరుక్కుపోయిన జలగ..డాక్టర్లు ఏం చేశారంటే ?

వాక్యూమ్ టెక్నాలజీతో విజయం

Update: 2026-02-03 02:30 GMT

ఎక్కడో పనికి వెళ్లిన దగ్గర నీళ్లు తాగాడో 55 ఏళ్ల వ్యక్తి. అదే అతడి పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా నీళ్లలో ఓ జలగ ఉండడం.. అది చూస్కోకుండానే అతడు తాగడం చకచకా జరిగిపోయాయి. కానీ అది గొంతులోకి వెళ్లి తట్టుకోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఏదో అడ్డుగా ఉందంటూనే 15 రోజులు నరకం చూశాడు. ఇక నొప్పిని భరించలేక ఓ ఆస్పత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు గొంతులో జలగ ఉందని, అది ఇంకా ప్రాణాలతో అక్కడే అటూ ఇటూ కదులుతోందని చెప్పారు. అంతేకాకుండా వెంటనే ఆపరేషన్ చేసి తీయాలని కూడా సూచించారు. మరి చివరకు ఏమైందంంటే?

అసలేం జరిగిందంటే..?

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా పచ్చాడ్ నియోజకవర్గంలోని కంగేర్ ధర్యార్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ దత్.. గత రెండు వారాలుగా గొంతులో అసౌకర్యంతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా గొంతులో ఏదో అడ్డు పడినట్లుగా అనిపిస్తుండగా.. శ్వాస తీసుకోవడం చాలా కష్టం అయింది. అలాగే మాట కూడా మారిపోవడంతో విపరీతంగా భయపడిపోయిన సురేష్ వెంటనే సోలన్‌లోని మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ (MMU) ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు లారింగోస్కోపీ పరీక్ష నిర్వహించగా.. గొంతులో ఏదో కదులుతున్నట్లు గుర్తించి మెరుగైన చికిత్స కోసం శిమ్లాలోని ఐజీఎంసీకి రిఫర్ చేశారు.

వాక్యూమ్ టెక్నాలజీతో విజయం

దీంతో సురేష్ వెంటనే ఐజీఎంసీకి వెళ్లగా.. తొలుత ఆయన్ను ఈఎన్టీ నిపుణులు పరీక్షించారు. అయితే ఆ వస్తువు శ్వాసనాళం వద్ద లోతుగా ఉండటంతో కేసును పల్మనాలజీ విభాగానికి బదిలీ చేశారు. అక్కడ బ్రాంకోస్కోపీ నిర్వహించగా.. నల్లటి రంగులో ఉన్న ఒక పెద్ద బతికున్న జలగ శ్వాస నాళానికి అతుక్కుపోయి ఉన్నట్లు తేలింది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సురేష్‌కు చెప్పారు. అతడు కూడా అందుకు అంగీకరించడంతో.. తర్వాతి చికిత్స కోసం వైద్యులు ప్రయత్నాలు చేపట్టారు.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జలగను కత్తిరించినా లేదా పట్టుకుని లాగినా.. అది ముక్కలై లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే డాక్టర్ డింపుల్ కె భాగ్లాని నేతృత్వంలోని వైద్య బృందం ఒక వినూత్న పద్ధతిని అనుసరించింది. వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఆ జలగను బతికుండగానే సురక్షితంగా బయటకు తీశారు. ఆపై దాన్ని బయట పారేశారు. మరోవైపు సురేష్ గొంతులోంచి జలగ బయటకు వెళ్లగానే.. ఆయన సులువగా శ్వాస తీసుకోగలిగారు. ఎంచక్కా నీళ్లు కూడా తాగేయగలిగారు. దీంతో వైద్యులు అదే రోజు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

అజాగ్రత్తే కారణమా?

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నేరుగా ప్రకృతి సిద్ధమైన నీటి వనరుల (చెరువులు, వాగులు) వద్ద నీరు తాగుతుంటారు. పశువులకు నీళ్లు తాగించే సమయంలో లేదా పొలాల్లో పని చేసేటప్పుడు నీటి ద్వారా ఈ జలగలు నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సురేశ్ దత్ విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే చెరువులు, వాగులు, కాలువల్లో నీళ్లు తాగేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఐజీఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా అడవి ప్రాంతాల్లోని నీటిని వడకట్టకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తాగవద్దని, గొంతులో స్వల్ప మార్పులు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు.

Tags:    

Similar News