Haveri Incident: మతాంతర జంటపై దాడి, యువతిపై అత్యాచారం
మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం;
కర్ణాటకలో దారుణం జరిగింది. లాడ్జికి వెళ్లిన ఓ జంటపై బయటి నుంచి వచ్చిన దుండగులు దాడిచేయటంతోపాటు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన కన్నడనాట తీవ్ర దుమారం రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనను బయటకు రాకుండా ప్రయత్నిస్తోందని విపక్ష భాజపా ఆరోపించింది.
కర్ణాటకలో లాడ్జికి వెళ్లిన స్నేహితులపై బయటి నుంచి వచ్చిన దుండగులు దాడిచేసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భార్యను ఏడుగురు ఆగంతకులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని హావేరి జిల్లా హానగల్ ఠాణాలో తౌసిఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో పోలీసులు అప్పుడు స్పందించారు. ప్రేమజంటపై దాడి జరిగిన లాడ్జికి వెళ్లిన పోలీసులు...సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బాధిత జంటతో ఏడుగురు దుండగులు అనుచితంగా ప్రవర్తించినట్లు గుర్తించారు.
నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి ప్రశ్నించగా యువతితోపాటు ఆమె స్నేహితునిపై దాడిచేసినట్లు వారు అంగీకరించారు. పరారీలో ఉన్న మిగితా నలుగురి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరిచయం ఉన్న కేఎస్‌ఆర్టీసీ డ్రైవరుతో మాట్లాడేందుకు యువతి హోటల్‌కు వెళ్లిన సమయంలో దాడి జరిగినట్లు తెలిసింది. నిందితులు లాడ్జి వద్ద కాపుకాసి...అక్కడికి వచ్చే జంటలపై దాడులు చేయటంతోపాటు అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రేమజంటపై దాడి ఘటన కర్ణాటకవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఈ ఘటన బయటకు రాకుండా ప్రయత్నిస్తోందని భాజపా ధ్వజమెత్తింది. ప్రేమజంటపై మూకుమ్మడి దాడి, సామూహిక అత్యాచార ఘటనను సిద్ధరామయ్య ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు.