AIIMS: మరణం అంచుల నుంచి మొదలైన ప్రయాణం
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఎయిమ్స్‌లో అద్భుతం... 11 ఏళ్ల బాలికకు ఒకేసారి రెండు అవయవ మార్పిడి చికిత్సలు.. ఇంతకీ ఇప్పుడు ఆ బాలిక ఎలా ఉంది..;
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)... సరిగ్గా ఏడేళ్ల క్రితం(7 yrs on) ఓ అద్భుతానికి వేదికైంది. మొదటిసారిగా ఎయిమ్స్‌లో కాలేయ మార్పిడి ఆపరేషన్( first living-donor liver transplant) జరిగింది. అదీ 11 ఏళ్ల చిన్నారికి. తర్వాత కొద్దిసేపటికే ఆ చిన్నారికే మళ్లీ కిడ్నీ మార్పిడి కూడా చేశారు. ఇలా ఒకేసారి రెండు అవయవాల మార్పిడి ఎయిమ్స్‌లో తొలిసారి జరిగింది. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌లు జరిగి ఇప్పటికీ సప్త వసంతాలు గడిచిపోయాయి. ఇక బతకడం కష్టం అనుకున్న ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది. నీ ఆయుర్దాయం ఇంకొన్నాళ్లే అన్న ఆ బాలిక ఇప్పుడు ఆరోగ్యంగానే ఉందా... తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
అది 2016వ సంవత్సరం. ఒడిశాలోని సోనేపూర్ జిల్లాకు చెందిన దంపతులు తమ 11 ఏళ్ల చిన్నారి దిబ్యా దిశా నంద(Dibya Disha Nanda)ను తీసుకుని ఎయిమ్స్‌కు వచ్చారు. బాలికను పరీక్షించిన వైద్యులు లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. అప్పటివరకూ ఎయిమ్స్‌లో అలాంటి ఆపరేషన్లు జరగలేదు. దిశా పరిస్థితి విషమంగా ఉందని, తప్పక ఆపరేషన్ చేయాలన్న వైద్యుల సూచనతో తల్లిదండ్రులు దానికి సిద్ధమయ్యారు.
దిశా తల్లి లివర్‌లో కొంత భాగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. దాని పరిమాణం తక్కువగా ఉన్నందున వైద్యులు నిరాకరించారు. బాలిక మేనమామ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశారు. 2016 ఏప్రిల్ 15 దిశాకు లివర్ కాలేయ మార్పిడి ఆపరేషన్( liver transplant) జరిగింది. ఇది జరిగిన 18 గంటలకే తల్లి కిడ్నీని( replacement of the kidney) దిశాకు మార్చారు. ఈ రెండు మార్పిడి శస్త్రచికిత్సలు కేవలం 18 గంటల వ్యవధిలోనే జరిగాయి.
ఈ శస్త్రచికిత్సల తర్వాత దిశా ఎంత కాలం జీవిస్తుందో చెప్పలేమని వైద్యులు చెప్పారు. కానీ దిశాకు ఇప్పుడు 18 ఏళ్లు. ఆరోగ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. కష్టాలను అధిగమించి, ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని సాగిస్తోంది. తనది మరణం అంచు నుంచి సాధారణ జీవితం వరకు సాగిన ఓ అద్భుత ప్రయాణమని దిశా చెబుతోంది. తనకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు తన తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు ఇంకా గుర్తున్నాయని దిశా చెబుతోంది.
"నేను ఎక్కువ కాలం జీవించలేనని చెప్పారు. కానీ నేను హాయిగా బతికేస్తున్నాను. డాక్టర్లు, నన్ను జాగ్రత్తగా చూసుకున్న కుటుంబ సభ్యుల కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా 12వ తరగతి చదువుతున్నాను. అని దిశా నవ్వుతూ చెబుతోంది. ఇంతకుముందు తాను తీసుకునే ఆహారంతో కొన్ని నియమాలు ఉండేవని... అయితే ఇప్పుడు ఏదైనా తినవచ్చని వైద్యులు చెప్పారని ఈ యువతి చెప్పింది.
మెటబాలిక్ డిసీజ్ - ప్రైమరీ హైపెరాక్సలూరియా వ్యాధితో దిశా ఆస్పత్రిలో చేరినట్లు AIIMS వైద్యులు తెలిపారు. ఈ సమయంలో రెండింటినీ మార్పిడి చేయడం మాత్రమే మిగిలి ఉన్న ఏకైక మార్గమని ఆనాటి ఘటనను డాక్టర్లు గుర్తు చేసుకున్నారు.