Himachal Pradesh : కుండపోత వర్షాలకు హిమాచల్‌ అతలాకుతలం

23 ఆకస్మిక వరదలు, 19 క్లౌడ్‌ బరస్ట్‌లు..;

Update: 2025-07-07 04:30 GMT

భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చరియలు, ఆకస్మిక వరదలతో హిల్‌ స్టేట్‌ హిమాచల్‌ప్రదేశ్‌  అతలాకుతలమవుతోంది. జూన్‌ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జులై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్‌ బరస్ట్‌లు, 16 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 78కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో వర్ష సంబంధిత ఘటనల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. రోడ్డు ప్రమాదాల్లో 28 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ‘హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో జులై 6 నాటికి మొత్తం మరణించిన వారి సంఖ్య 78కి చేరుకుంది’ అని వెల్లడించింది. ఇక ఈ వర్షాలు, వరదల కారణంగా 37 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు 115 మంది గాయపడ్డారు. ఈ విపత్తు కారణంగా దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచాన వేస్తోంది.

ఈ వర్షాలకు రెండు జాతీయ రహదారులు సహా దాదాపు 243 రోడ్లను అధికారులు మూసివేశారు. 278 విద్యుత్‌ కేంద్రాలు, 261 నీటి ప్రాజెక్టులు మూతపడ్డాయి. మరోవైపు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. అదేవిధంగా జులై 8, 9 తేదీల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసింది. సిర్మౌర్‌, కాంగ్రా, మండి.. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఇచ్చింది. సిమ్లా, సోలన్‌, హమీర్‌పూర్‌, బిలాస్‌పూర్‌, ఉనా, కులు, చంబా.. ఈ ఏడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Tags:    

Similar News