No-Confidence: చరిత్ర పుటల్లో "అవిశ్వాస తీర్మానం"
భారత చరిత్రలో ఇప్పటివరకూ 27 సార్లు లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానం... ఇది 28వసారి.. ఇందిరాగాంధీపై అత్యధికసార్లు అవిశ్వాసం..;
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని (No Confidence Motions) ప్రవేశపెట్టాయి. దీంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది. చరిత్రలో ఇప్పటివరకు 27 సార్లు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా ఒక్కసారి కూడా ప్రభుత్వాలు కుప్పుకూలలేదు. అధికార పక్షం బల నిరూపణకు ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాల్లో మాత్రం 3 సార్లు ప్రభుత్వాలు పడిపోయాయి.
మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. భారత చరిత్రలో ఈ అవిశ్వాస తీర్మానం 28వది. గతంలో ప్రవేశపెట్టిన అన్ని అవిశ్వాస తీర్మానాల్లోనూ విపక్షాలు ఓడిపోవడం లేదా తీర్మానాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. బల నిరూపణకు అధికార పక్షాలు విశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టిన 3సందర్భాల్లో మాత్రం ప్రభుత్వాలు పడిపోయాయి. 1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టగా దానిపై చర్చ పూర్తికాకుండానే, ఓటింగ్ జరగకుండానే ఆయన రాజీనామా చేశారు. 1990లో VP సింగ్ ప్రభుత్వం, 1997లో దేవెగౌడ ప్రభుత్వం, 1999లో వాజ్‌పేయి సర్కారు విశ్వాస తీర్మానాల్లో ఓటమి చవిచూసి కుప్పకూలాయి.
భారత్-చైనా యుద్ధం ముగిసిన వెంటనే 1963లో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేత ఆచార్య కృపలాని( Jawaharlal Nehru government in 1963 by Acharya J.B. Kripalani) అవిశ్వాస తీర్మానాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు. 62-347 ఓట్ల తేడాతో ఆ తీర్మానం ఓడింది. 1964లో ఒకసారి, 1965లో రెండుసార్లు లాల్ బహదూర్ శాస్త్రీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు రాగా అవన్నీ వీగిపోయాయి. ఇక దేశ చరిత్రలో అత్యధికంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానిగా ఇందిరాగాంధీ నిలిచారు. 1966 నుంచి 1982 వరకు ఆమె 15 సార్లు(Indira Gandhi faced 15 no-confidence motions) అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని విజేతగా నిలిచారు.
1987లో రాజీవ్ గాంధీప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయింది. 1992లో రెండుసార్లు, 1993లో ఒకసారి పీవీ నరసింహారావు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు ఓడిపోయాయి. 2003లో అటల్‌బిహారీ వాజ్‌పేయ్( Atal Bihari Vajpayee) ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియాగాంధీ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. 2018లో నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని ప్రవేశపెట్టిన నో కాన్ఫిడెన్స్ తీర్మానం 135-330 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇలా ఇప్పటివరకు 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి.